సిటీబ్యూరో, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎప్పటిలాగే ఈ సారి కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. 15 మంది సభ్యులకు 19 మంది దరఖాస్తులు సమర్పించారు. బీఆర్ఎస్ నుంచి 10, ఎంఐఎం ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగానే గడిచిన రెండు రోజులు దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ మేరకు శనివారం లోగా ఉపసంహరణ గడువు ఉంది. దీంతో కాంగ్రెస్ నుంచి వేసిన ఇద్దరు కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, ఈఎస్ రాజ్ జితేంద్రనాథ్, బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లు సబితా కిశోర్, లావణ్య దూసరి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో 15 మంది ఉంటే.. ఎన్నిక ఏకగ్రీవం అని అధికారులు ప్రకటించనున్నారు. లేని పక్షంలో పోటీలో 15 మంది కన్నా ఎక్కువ మంది నిలిస్తే 7న జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవమవుతుందని అధికారులు పేర్కొన్నారు.