వానలు కురుస్తున్న వేళ.. బల్దియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సెల్లార్ తవ్వకాలపై నిషేధం విధించింది. తక్షణం అమల్లోకి వచ్చిన ఈ ఆదేశాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని కమిషన్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే తవ్వకాలు జరిపి ఉంటే.. యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ..నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.
సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): వర్షాకాల జాగ్రత్త చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. వర్షాలు మొదలవుతున్న తరుణంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సెల్లార్ తవ్వకాలపై నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం ఆమల్లోకి వచ్చిన ఈ ఉత్తర్వు ఆదేశాలు వచ్చే సెప్టెంబరు మాసం చివరి వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే తవ్వకాలు జరిపి ఉండే వర్షాకాలం పూర్తయ్యే వరకు వాటి వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని యాజమానులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్లార్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండటమే లక్ష్యంగా ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని సంకల్పించారు. వర్షపు నీటితో మట్టి పెళ్లలు విరిగిపడి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదాల నివారణలో భాగంగా రాబోయే మూడు నెలల పాటు నిషేధం ప్రకటించామని, నిబంధనలు పాటించకపోతే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.