సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ ): పర్యాటక స్థలాల పరిశుభ్రతపై జీహెచ్ఎంసీ శీతకన్ను వేసింది..పారిశుధ్య నిర్వహణలో ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా దుర్గందభరిత వాతావరణంలో పర్యాటక స్థలాలు దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలకు తోడుగా చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల నుంచి వచ్చే చెత్తను సకాలంలో ఎత్తివేయకపోవడంతో పర్యాటక స్థలాలు కంపుకొడుతున్నాయి. ఇటీవల కాలంలో ఎక్స్ వేదికగా పౌరులు పారిశుధ్య లోపాన్ని ఎత్తి చూపుతుండడం ఒకవైపు…మరోవైపు నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిన అధికారులు.. వాటి పనితీరు పట్ల పర్యవేక్షణ లోపించింది.
అన్నింటి కంటే మించి రెండు ఏజెన్సీల నిర్వహణ గడువు ముగిసినప్పటికీ వారినే కొనసాగిస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా టెండర్లు పిలిచి అర్హులైన ఏజెన్సీకి పనులు అప్పజెప్పాల్సిన అధికారులు.. పాతవారినే కొనసాగిస్తుండటం వెనుక మతలబు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం 73.75 కిలోమీటర్ల మేర పారిశుధ్యాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రతి నెలా దాదాపు రూ. 2.40 కోట్ల మేర ఖర్చు చేస్తుండడం గమనార్హం.
తొమ్మిది ప్యాకేజీలుగా
పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీ/వీఐపీలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల పారిశుధ్య నిర్వహణను 73 కిలోమీటర్ల మేర రహదారులను అప్పగించారు. తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి మూడేండ్ల పాటు రెండు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించగా…దాదాపు ఏడాది కాలంగా కొత్త వారికి పనులు అప్పగించకుండా పాత వారితోనే కాలం వెళ్ల దీస్తున్న అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. వాస్తవంగా 24 గంటలూ స్వీపింగ్ జరిగేలా మెక్లిన్, ఇక్సోరా కంపెనీలకు ఈ బాధ్యత అప్పగించారు.
ఇందుకుగానూ కిలోమీటర్‌కు సగటున నెలకు రూ.3.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వాస్తవంగా ఇదే పనిని కార్మికుల స్వీపింగ్‌కు నెలకు అయ్యే వ్యయం రూ.40వేలు మాత్రమే. కార్మికులతో పోలిస్తే ప్రైవేట్‌కు చెల్లిస్తున్నది ఎనిమిది రేట్లు అధికం. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేట్ విధానంపై తీవ్ర స్థాయిలో అరోపణలు లేకపోలేదు.