ఖైరతాబాద్, ఏప్రిల్ 4 : ఆస్తి పన్నుల చెల్లింపునకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బల్దియా ఎర్లీబర్డ్ ఆఫర్ను ప్రారంభించింది. ముందుస్తుగా పన్నులు చెల్లించిన వారికి మొత్తంలో ఐదు శాతం రాయితీ లభిస్తుంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిళ్ల పరిధిలో చెల్లింపుదారులకు సదావకాశమిచ్చారు. ఈ ఆఫర్ చెల్లింపుదారులకు డబ్బులు ఆదా చేయనున్నది. భారీ పన్నులు చెల్లించే వారికి ఎర్లీబర్డ్ ఆఫర్ లాభాలను తెచ్చిపెడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ 2022 నుంచి 2023 మార్చి 31 వరకు ఖైరతాబాద్ సర్కిల్లో 53,953 అసెస్మెంట్లకు రూ.135.41 కోట్లు, జూబ్లీహిల్స్లో 49,794 అసెస్మెంట్లకు గాను రూ.170.13 కోట్లు ఆస్తి పన్నులు వసూలయ్యాయి. గత నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియగా, ఈ నెల నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక నెల రోజుల పాటు పన్ను చెల్లింపుదారులకు వెసలుబాటు కల్పించేందుకు ప్రతి ఏడాది ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా అవకాశం కల్పిస్తారు. ఈ నెల 30వ తేదీలోగా పన్నులు చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ లభించనున్నది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎర్లీబర్డ్ ఆఫర్ను ప్రవేశపెట్టాం. జోనల్ కమిషనర్ కార్యాలయంలో సిటిజన్ సర్వీస్సెంటర్, ఆన్లైన్, ఆఫ్లైన్, మీసేవ సెంటర్లలో చెల్లించవచ్చు. బిల్ కలెక్టర్లు ఇంటి వద్దకే వచ్చి పన్నులు తీసుకుంటారు. ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ లభిస్తుంది.
– మోహన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ 17