Allu Arjun | బంజారాహిల్స్, సెప్టెంబర్ 8 : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంటూ సోమవారం జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లో రెండేళ్ల క్రితం అల్లు బిజినెస్ పార్క్ పేరుతో భవనాన్ని నిర్మించారు. గీతా ఆర్ట్స్‌తో పాటు అల్లు ఆర్ట్స్‌కు సంబంధించిన వ్యాపారాలు, ఇతర సంస్థలకు చెందిన కార్యాలయాలు ఇక్కడున్నాయి. సుమారు 1226 గజాల స్థలంలోని ఈ భవనానికి రెండు సెల్లార్లతో పాటు జీ ప్లస్ 4 అనుమతి ఉంది. కాగా ఇటీవల నాలుగో అంతస్తుపైన అక్రమ నిర్మాణాన్ని చేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సర్కిల్-18 డీఎంసీ సమ్మయ్య విచారణకు ఆదేశించారు. అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చవద్దో తెలపాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేశారు.