సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ మీదుగా యాదగిరి థియేటర్ వరకు రూ.620 కోట్ల వ్యయంతో జరుగుతున్న 2.58 కిలోమీటర్లలో నాలుగు లేన్ల బైడైరెక్షనల్ స్టీల్ బ్రిడ్జి (ఫ్లైఓవర్) నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం కమిషనర్ ఆర్వీ కర్ణన్.. మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బాలాలా, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నతో కలిసి నల్లగొండ క్రాస్ రోడ్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టును వచ్చే 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని సంబంధిత ఇంజనీర్లు.. కమిషనర్, ఎమ్మెల్యేకు వివరించారు. భూసేకరణ పెండిం గ్ సమస్యల్ని టౌన్‌ప్లానింగ్ అధికారులు వెంటనే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.
అనంతరం కమిషనర్ మలక్‌పేట ఆర్యూబీ వద్ద వరద నీటి నిల్వ సమస్యను పరిశీలించారు. దీనికి ప్రత్యామ్నాయ డ్రైనేజ్ మార్గాలను పరిశీలించి ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం డబీర్‌పుర నాలా పనులను పరిశీలించి వర్షాల సమయంలో నాలాలో వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా చూస్తూ నాలా సమీప ప్రాంతాల ప్రజలు వరద ముంపునకు గురికాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మలక్‌పేట డిప్యూటీ కమిషనర్ ఎంకెఐ అలీ, ప్రాజెక్టు ఈఈ గోపాల్ పాల్గొన్నారు.