సిటీబ్యూరో, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చెత్త సేకరణ కార్యకలాపాల్లో ఆలస్యం, నిర్లక్ష్యం కారణంగా రాంకీ ఏజెన్సీకి శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నోటీసు జారీ చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా 2, 532 గార్భేజ్ వల్నరబుల్ పాయింట్ (జీవీపీ)లలో బిన్ పాయింట్లలో ప్రతి రోజు ఉదయం 10. 30 గంటల కల్లా చెత్తను ఒప్పందం మేరకు సంస్థ తప్పనిసరిగా తొలగించాలి.
గురువారం నగర వ్యాప్తంగా ఉన్న 2,532 జీవీపీ పాయింట్లలో కేవలం 1879 మాత్రమే నిర్ధేశిత సమయంలో తొలగించినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. చెత్తను తొలగించడంలో రాంకీ సంస్థ వైఫల్యం చెందుతుందని అధికారులు తెలిపారు. ప్రతిపాదించిన 2000 సెకండ్ స్టోరేజ్ బిన్లలో 850 బిన్లను మాత్రమే ఏర్పాటు చేసింది మిగిలిన బిన్లను వెంటనే ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉదయం 9.30 గంటల కల్లా వ్యర్థాలను తొలగించాలని కమిషనర్ సంస్థను ఆదేశించారు. ఈ ఆదేశాలను పాటించకపోతే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం హెవీ పెనాల్టీలు విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ నోటీసులో రాంకీ సంస్థకు కమిషనర్ హెచ్చరించారు.