సిటీబ్యూరో, సెప్టెంబరు 12 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో ఇకనుంచి అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే ఎలక్ట్రానిక్ వస్తువుల సమగ్ర జాబితాను డిజిటలైజ్ చేయనుంది. ఇందుకోసం టీజీ ఆన్లైన్ సహకారంతో ఎస్సెట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను కొత్తగా రూపకల్పన చేసి జీహెచ్ఎంసీ ఆవిషరించింది. ఈ విధానంలో వస్తువుల పర్యవేక్షణ, నిర్వహణ మెరుగుపడనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం మాన్యువల్ వివరాలు నమోదు చేసి, కంప్యూటరీకరణ చేస్తుండగా ఇక నుంచి వస్తువులకు సంబంధించి ఇండెంట్ నుంచి ఆమోదం, జారీ వరకు అంతా వెబ్సైట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది.
సాధారణంగా సంస్థలోని అన్ని సెక్షన్లకు అవసరాన్ని బట్టి కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్(సీపీయూ), మానిటర్, కేబుళ్లు, మౌ స్లు, ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలు వంటివి ఐటీ విభాగం సమకూరుస్తోంది. హోదాను బట్టి కొం దరు అధికారులకు ల్యాప్‌టాప్‌లు , మొబైల్ ఫోన్లు , ట్యాబ్‌లు ఇస్తారు. పలువురు అధికారులు, కొన్ని విభాగాలు ఆయా వస్తువులు తరచూ తీసుకుంటున్నట్టు గుర్తించారు. అంతకుముందు ఎప్పుడు వస్తువులు ఇచ్చామన్న వివరాలు ఇచ్చామన్న పూర్తిస్థాయి సమాచారం ఐటీ విభాగం వద్ద లేకపోవడం వల్లే కొంతమేర దుర్వినియోగం జరుగుతుందన్న అంచనాకు వచ్చారు.
ఈ పద్ధతికి చెక్ పెట్టేలా డిజిటలైజేషన్ నిర్ణయం తీసుకున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఫలితంగా ఎస్సెట్ ( వస్తువుల) మేనేజ్మెంట్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుంది. ఉద్యోగులకు కేటాయించిన వస్తువు ఎవరి వద్ద ఉందో సులభంగా ట్రాకింగ్ చేయవచ్చు. వస్తువుల బదిలీ, తిరిగి తీసుకోవడం సులభతరం కానుంది. అదే విధంగా ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ వస్తువుల సత్వర జారీకి వీలు కలుగుతుంది. సాంకేతిక దన్నుగా తెచ్చిన ఈ కొత్త వ్యవస్థ పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాన్యువల్ విధానంలో ఉద్యోగులకు ఇచ్చిన వస్తువుల వివరాలను తెలుసుకోవాలంటే అనేక రిజిస్టర్లను తిరిగేయాల్సి వచ్చేది. చాలా సమయం పట్టేది. ఏ వస్తువు ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ విధానంలో వస్తువుల డిజిటలైజేషన్‌తో ఒక క్లిక్ దూరంలో సమాచారం లభిస్తుంది. ఏ విభాగం,అధికారి ఏ వస్తువు కోసం ప్రతిపాదన పెట్టారు..? ఎప్పుడు సరఫరా చేశాం..? తదితర వివరాలు ఇక నుంచి వెబ్సైట్లో నమోదు కానున్నాయి.
ఫలాన వస్తువు కా వాలన్నా విజ్ఞప్తి నుంచి దానిని పరిశీలించి ఐటీ విభాగం అధికారులు ఆమోదం, సరఫరా వరకు అన్ని వివరాలు వెబ్సైట్లో ఉంటాయి. సంబంధిత విభాగం, అధికారులకు సరఫరా చేసే ముందు ప్రతి వస్తువుపై బార్ కోడ్ అంటిస్తారు. దానిని సానింగ్ చేస్తే వివరాలు వెబ్సైట్లో ఎంటర్ కానున్నాయి. దీంతో ఎవరు ఎప్పుడు ఏ వస్తువు తీసుకున్నారన్నది సులువుగా తెలుస్తుంది.