
సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : నాలాల పూడికతీత పనులను అత్యంత పారదర్శకంగా చేపట్టడమే కాదు.. నాలాల నుంచి వెలికితీసిన సిల్ట్‌ను స్మార్ట్‌గా డంపింగ్ యార్డుకు తరలించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రక్కులను వినియోగించేందుకు కసరత్తును ప్రారంభించారు. సిల్ట్ తరలింపులో సాంకేతికతను వినియోగించుకొని ఏడాది పొడవునా డీసిల్టింగ్ సవ్యంగా జరిగేందుకు నూతనంగా ట్రక్కులను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో పూడిక తీసినా.. నాలాల పక్కనే వేస్తుండటంతో తిరిగి నాలాల్లోకి చేరుతోంది.
తరలించేందుకు వాడుతున్న వాహనాలు పాతవి కావడంతో రవాణా సమయంలో రోడ్లపై వ్యర్థాలు పడటంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ పరిస్థితి నివారణకు లీకేజీ ఫ్రీగా ఉండేలా ప్రత్యేక ట్రక్కును తయారు చేయిస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా 25 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఒక ట్రక్కు తయారీ పనులు చేపట్టి త్వరలోనే ఈ ట్రక్కులను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) తరహాలో వరుసగా మూడేండ్ల పాటు నాలాల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. డీసిల్టింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు గాను ఈ నూతన నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పూడికతీతకు యేటా దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొత్త విధానంలో రూ. 100 నుంచి 150 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం దృష్ట్యా ఖర్చుకు వెనుకాడబోమని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కొత్తగా వినియోగంలోకి తీసుకువచ్చే ట్రక్కుల నుంచి సిల్ట్ లీకేజీ కాదు. ప్రస్తుతం సిల్ట్ తరలిస్తున్న వాహనాలు మైల్డ్‌స్టీల్‌తో తయారైనవి కావడంతో తుప్పు పడుతున్నాయి. సిల్ట్ రోడ్లపై పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొత్త ట్రక్కులకు బాడీ తుప్పు పట్టకుండా ఉండేందుకు తగిన మందంతో ఎఫ్ఆర్పీ (ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్) లైనింగ్ ఉంటుంది. వాహనంలోని సిల్ట్ కనిపించకుండా పూర్తిగా కప్పి వేసేలా మూతలుంటాయి. సిల్ట్‌ను డ్రైవర్ క్యాబిన్ నుంచే లోడింగ్, అన్ లోడింగ్ చేయవచ్చు. సిల్ట్ నుంచి వెలువడే వ్యర్థ జలాలు కూడా కింద పడకుండా ట్రక్‌లోనే ప్రత్యేక ట్యాంకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.