
సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి అన్ని చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ సభ్యురాలు అంజన పన్వార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని హరిత ప్లాజా గెస్ట్‌హౌస్‌లో ఆమె సఫాయి కర్మచారుల కోసం జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపాలిటీ కమిషనర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలోని సాహెబ్ నగర్ పద్మావతి కాలనీలో డ్రైనేజీ పూడికతీత పనులు చేస్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు శివయ్య, అంతయ్య మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, సైబరాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, రాచకొండ డీసీపీ సంప్రీత్ సింగ్, ఏసీపీలు, సోషల్ వెల్ఫేర్ జేడీలు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి, జీహెచ్ఎంసీ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, సఫాయి కర్మచారులకు చెందిన సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.