
సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ): పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మహా నగరాన్ని బిన్ (చెత్త డబ్బా) రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు రోడ్లపై చెత్త పడేయడాన్ని ఆపివేసేందుకు గాను జీహెచ్ఎంసీ 900 చెత్త వ్యర్థాల బిన్లు (డబ్బాలను) తొలగించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు గాను ఇంటికి రెండు డబ్బాలను పంపిణీ చేశారు. ఇంటింటి చెత్త సేకరణకు 3150 స్వచ్ఛ టిప్పర్లను తీసుకొచ్చి చెత్త సేకరణ, తరలింపులో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే గతంలో నిత్యం 5,600 నుంచి ఆరువేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమ నిబంధనల ప్రకారం, చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు ప్రక్రియ జరుగుతున్నది. ఈ ఇంటింటికీ చెత్త సేకరణ అమలులో భాగంగా గతంలో కంటే దాదాపు 1500 మెట్రిక్ టన్నుల మేర వ్యర్థాలు సేకరణ పెరిగింది. రోజూ ఏడువేలకు పైగా చెత్తను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తరిత ప్రాంతాలలోనూ ఇంటింటి చెత్త సేకరణకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా త్వరలో కొత్తగా 1350 స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, స్వచ్ఛ ఆటో టిప్పర్ల రాకతో 2016వ సంవత్సరంలో 3500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండగా, 2017 నాటికి 4,500 మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. గతేడాది 5,600 మెట్రిక్ టన్నుల చెత్త, ఈ ఏడాదిలో ఆరువేల మెట్రిక్ టన్నులు ఉండగా, ప్రస్తుతం రోజూ 7200 మెట్రిక్ టన్నులు, పండగల సమయంలో మరో 1500 మేర చెత్తను సేకరిస్తున్నారు.
గత రెండు రోజులుగా నగరంలో 2,976 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను అదనంగా జీహెచ్ఎంసీ సేకరించింది. బక్రీద్ పండగతో వచ్చిన జంతు వ్యర్థాలను ప్రధానంగా సేకరించామని తెలిపారు. 21, 22వ తేదీలలో యానిమల్ వేస్ట్‌లను తీసివేసేందుకై అదనపు వాహనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎల్బీనగర్ జోన్లో 30 మెట్రిక్ టన్నులు, చార్మినార్ జోన్లో 1400, ఖైరతాబాద్‌లో 850, శేరిలింగంపల్లి జోన్లో 349, కూకట్‌పల్లిలో 60, సికింద్రాబాద్ జోన్లో 287 టన్నుల జంతు వ్యర్థాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.