
మాంసహార ప్రియులూ జర జాగ్రత్త..ముక్క తినాలనుకునే ముందు ఆ ముక్క మంచిదా? కాదా? అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మాంసం కొనుగోలు సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం
వహించినా అనారోగ్యబారిన పడక తప్పదు. ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు మాంసం అమ్మకాలు జరిపే షాపులపై దాడులు
నిర్వహించగా..నిబంధనలు అతిక్రమించిన 139 షాపు నిర్వాహకులపై కొరఢా ఝళిపించింది. 539కిలోల కల్తీ మటన్,బీఫ్ (గొడ్డు మాంసం) 2851 కిలోల మేర కల్తీ మాంసాన్ని జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక జరిమానాలు రూ.63,100 వసూలు చేసినట్లు వెటర్నరీ అధికారుల రికార్డుల్లో స్పష్టమవుతున్నది. సికింద్రాబాద్, కూకట్పల్లి, ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే కల్తీ మాంసం ఎక్కువగా అమ్ముతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. మొత్తంగా మటన్ కొనేముందు జీహెచ్ఎంసీ స్టాంపు వేసిన మాంసాన్నే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని మాంసం దుకాణాదారులు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం ఆమోదించిన మాంసా న్నే అమ్మాలి. అంబర్పేట, రామ్నాస్పుర, న్యూబోయిగూడ, జియాగూడ, చెంగిచర్ల స్లాటర్హౌజ్ల నుంచి తీసుకొచ్చిన మాంసాన్నే వ్యాపారులు అమ్మాలి. ముందుగా ఈ స్లాటర్హౌజ్లో గొర్రె, మేక కానీ ఆరోగ్య స్థితిని డాక్టర్ పరీక్షిస్తారు. యాంటీమార్టం, పోస్టుమార్టం చేసిన తర్వాతనే ఆయా మాంసం తినొచ్చని నిర్ధారిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు స్టాంప్ వేసి వ్యాపారులు ఇస్తారు. కట్ చేసిన గొర్రె, మేక తొంటిభాగంలో స్లాటర్హౌజ్, తేదీ, రిసిఫ్ట్లో సమగ్ర వివరాలతో వ్యాపారికి అందిస్తారు. సదరు వ్యాపారి ఆయా షాపు ద్వారా అమ్మకాలు జరుపుతారు. కానీ చాలా చోట్ల గుడ్డిగా మాంసం కొనుగోలు చేస్తున్నారు. ఒక పక్క జీహెచ్ఎంసీ విస్తృత అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. దీనినే అదునుగా భావిస్తూ కల్తీ వ్యాపారాన్ని కొందరు ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చనిపోయిన, రోగాల బారిన పడిన గొర్రె, మేకలు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్న చోటనే మాంసాన్ని కొనుగోలు చేసి ఆరోగ్యంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్టాంపింగ్ లేకుండా నిబంధనలకు విరుద్ధ్దంగా మార్కెట్లో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.