మెహిదీపట్నం జూన్ 17 : పోలీసులమని చెప్పి ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు దోచుకుని పారిపోయిన ఐదుగురు నిందితుల ముఠాలోని నలుగురిని టోలిచౌకి పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చంద్రమోహన్, టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్, అదనపు ఇన్స్పెక్టర్ బాలరాజులతో కలిసి వివరాలను వెల్లడించారు.
టోలిచౌకికి చెందిన ఎండీ టౌఫీజ్, షహబాజ్ ఆలం ఈనెల 15వ తేదీ రాత్రి షేక్పేట్ పాస్పోర్ట్ ఆఫీస్ సమీపంలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా అయిదుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి పోలీసులమని బెదిరించి 5450 రూపాయలను లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఎండీ అబ్దుల్ సల్మాన్, షేక్ ఆసిఫ్, ఎండీ నవాజ్, ఎండీ అబ్దుల్ ఫెరోజ్ లను పట్టుకున్నారు. కాగా, సయ్యద్ ఫజల్ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి 5450 రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.