సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ సంస్థల్లో ప్రధానమైన పోస్టుల్లో ఉద్యోగాలు చేస్తున్నామని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేసిన వారిపై బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట, భరత్‌నగర్‌కు చెందిన సీహెచ్కుమార్ ప్రింటింగ్ పీల్డ్‌లో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తిలక్‌నగర్‌కు చెందిన వెలగపూడి రామకృష్ణ తన బంధువుల ద్వారా పరిచయం అయ్యాడు. తాను తెలంగాణ సెక్రటేరియట్లో ఇండస్ట్రీ విభాగంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. తనకు ప్రభుత్వ అధికారులతో మంచి పరిచయాలు ఉన్నాయని, డబుల్ బెడ్రూం కోసం దరఖాస్తు చేసుకొని ఉన్న వారికి రూ.35 వేలు, మీ సేవాలో దరఖాస్తు చేసుకోని వారికి రూ.45 వేలు ఇస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ నమ్మించాడు.
నిమ్స్‌లో నర్సు.., నాల్గోతరగతి ఉద్యోగాలు
అలాగే వాణి రమా అనే మరో మహిళను పరిచయం చేసి, ఆమె జీఏడీ విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తుందని నమ్మించాడు. డబుల్ బెడ్రూమ్తో పాటు భువనగిరిలోని నిమ్స్‌లో నర్సు ఉద్యోగం, నాల్గో తరగతి ఉద్యోగాలైన అటెండర్ పోస్టులు కూడా ఇప్పిస్తామంటూ నమ్మించాడు. వాళ్ల మాటలు నమ్మిన బాధితుడి బంధువులు, తెలిసిన వాళ్లు 45మంది వరకు రూ. 20,08,500 రామకృష్ణ, వాణిరమాలకు పంపించారు. మీరిచ్చిన డబ్బులు ఆయా విభాగాల హెచ్ఓడీలకు పంపించామని రెండు నెలల్లో మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయంటూ నమ్మించారు.
నర్సు ఉద్యోగానికి రూ.5.15 లక్షలు
ఇంతలో రావు అనే పేరుతో మరో వ్యక్తిని పరిచయం చేశారు అతను డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు బాధితులకు చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మి నర్సు ఉద్యోగానికి రూ.5.15 లక్షలు కూడా పంపించారు. సమయం గడుస్తున్నా రేపు మాపు అంటూ కాలయపాన చేయడం మొదలు పెట్టారు. బాధితులు రామకృష్ణ, వాణిరమా, రావుల గురించి ఆరా తీయడంతో ఇదంతా మోసమని గుర్తించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.