సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య నివారణకు కొత్త రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నామ మార్గాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా పురపాలక శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ముఖ్యంగా 9 ఏళ్లలో ఐటీ కారిడార్ మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి వైపు నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్, కోకాపేట, పుప్పాల్‌గూడ వరకు విస్తరించడంతో నానక్‌రాంగూడ ఔటర్ రింగు రోడ్డు ఇంటర్చేంజ్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో ఔటర్ మీదుగా వచ్చే వాహనాలకు తోడు, కోర్ సిటీ నుంచి వచ్చే వాహనాలతో నానక్‌రాంగూడ ఇంటర్చేంజ్ వద్ద ఇరువైపులా ఉన్న రోటరీ వద్ద ట్రాఫిక్ జామ్ సమస్య నిత్యం ఇబ్బంది పెట్టింది. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇందులో మొదటగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే వాహనాలను నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు రాకుండా.. నార్సింగి వద్ద ఒక ఇంటర్‌చేంజ్‌ను నిర్మించారు. మరో ర్యాంపును నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా దాటిన వెంటనే నిర్మించి, అక్కడి నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్లోకి వెళ్లేలా కొత్త మార్గాలను అందుబాటులోకి తెచ్చారు.
అదే సమయంలో నార్సింగి నుంచి గచ్చిబౌలి వైపు సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలను నానక్‌రాంగూడ ఇంటర్చేంజ్ మీదుగా వెళ్లకుండా ఉండేందుకు నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా దాటిన వాహనాలను ఓఆర్ఆర్ ప్రధాన రహదారి పైకి వెళ్లే విధంగా మరో లింకు రోడ్డును నిర్మించారు. దీంతో నానక్‌రాంగూడ ఇంటర్చేంజ్ వద్ద ట్రాఫిక్ చిక్కులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి.. నార్సింగి, మంచిరేవుల, కోకాపేట ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఓఆర్ఆర్ పైకి వెళ్లి.. అక్కడ గచ్చిబౌలి చౌరస్తా మీదుగా మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, మియాపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు సులభమైందని వాహనదారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ అధికారులు ఔటర్ రింగు రోడ్డును అనుసంధానిస్తూ చేపట్టిన కొత్త మార్గాలు ట్రాఫిక్ రద్దీ నుంచి ఊరట కలిగిస్తున్నాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.