హైదరాబాద్, నవంబర్ 23: మొన్న నైట్ ఫ్రాంక్.. నిన్న వెస్టియన్.. నేడు అనరాక్.. రిపోర్టు ఏదైనా చెప్పేదొక్కటే. రియల్ ఎస్టేట్ రారాజు హైదరాబాద్ అనే. తాజాగా విడుదలైన నివేదికలో దేశంలోని టాప్-7 నగరాల్లో హైదరాబాదే ఆకర్షణీయమని అనరాక్ పేర్కొన్నది. ఇక్కడి డిమాండ్‌తో సగటు నివాస గృహాల ధరలు భారీగా పెరిగాయని గురువారం ఇచ్చిన రిపోర్టులో ఈ ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ స్పష్టం చేసింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల్లో గడిచిన మూడేండ్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ తీరుతెన్నుల ఆధారంగా ఈ నివేదికను అనరాక్ తయారు చేసింది.
హైదరాబాద్‌సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గడిచిన మూడేండ్లలో ఇండ్ల ధరలు డిమాండ్ ఆధారంగా సగటున 13 నుంచి 33 శాతం మేర పెరిగినట్టు అనరాక్ ఈ సందర్భంగా తెలిపింది. ఇందులో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రేట్లు గరిష్ఠంగా 33 శాతం పెరిగినట్టు స్పష్టం చేసింది. 2020 అక్టోబర్‌లో చదరపు అడుగు రూ.4,790 పలికితే.. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.6,355గా ఉందని వివరించింది. అలాగే కొండాపూర్లోనూ చదరపు అడుగు ధర 31 శాతం పెరిగి రూ.4,650 నుంచి రూ.6,090కి ఎగిసినట్టు తేలింది.
గతంతో పోల్చితే ఇండ్ల కొనుగోలుదారుల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని, బడ్జెట్ ఎక్కువైనా.. విశాలమైన ఇండ్లను కొనేందుకే మొగ్గు చూపుతున్నారని అనరాక్ రిసెర్చ్ హెడ్ ప్రశాంత్ థాకూర్ అన్నారు. అన్ని సదుపాయాలుండే చోటునే ఎంచుకుంటున్నారని, హైదరాబాద్ ఈ విషయంలో దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ముందున్నదని చెప్పారు. ఇక గత కొన్నేండ్లుగా స్థిరాస్తి ధరలు పెరుగుతూపోతున్నాయని, ఇందుకు కారణం మార్కెట్లో డిమాండ్‌తోపాటు, పెరిగిన నిర్మాణ ఖర్చులు కూడా అని సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) ఎండీ రవీ అగర్వాల్ తాజా రిపోర్టుపై స్పందించారు.
అవును.. సమగ్ర అభివృద్ధికి అసలు సిసలు ప్రామాణికమైన రియల్ ఎస్టేట్ రంగం.. రాష్ట్రంలో ప్రగతిపథంలో పయనిస్తున్నది మరి.
ఒకటి కాదు.. రెండు కాదు.. యావత్తు దేశ, విదేశీ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీలన్నీ హైదరాబాదే టాప్ అంటున్నాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పనితీరును చెప్పకనే చెప్తున్నాయి.
అక్టోబర్‌లో హైదరాబాద్‌లో 5,787 ఇండ్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.3,170 కోట్లుగా ఉన్నది. నిరుడుతో పోల్చితే 25 శాతం పెరిగాయి. లగ్జరీ ఇండ్లకు క్రమేణా గిరాకీ పెరుగుతున్నది.
-నైట్ ఫ్రాంక్ ఇండియా
హైదరాబాద్ ఆఫీస్ స్పేస్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. బెంగళూరును దాటి ఇక్కడి కార్యాలయ స్థలాలకు కార్పొరేట్ల నుంచి పోటీ నెలకొనడం విశేషం. ప్రధాన నగరాలతో పోల్చితే లీజింగ్ పెరిగింది.
-వెస్టియన్
హైదరాబాద్ వంటి నగరాల దన్నుతోనే భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్.. ఆఫీస్కై నా, ఇంటికైనా ఇప్పుడు హాట్ ఫేవరేట్.
-నరెడ్కో
ఔషధ, ఐటీ, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో వృద్ధి.. హైదరాబాద్‌కు జోష్నిస్తున్నది. ఇక్కడి ల్యాండ్, ఫ్లాట్, ఇండిపెండెంట్, విల్లాలకు ఆదరణ భేష్.
-క్రెడాయ్