సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): రహదారులు, కూడళ్లలో ఆకలితో అలమటించే వారికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ సభ్యులు ఉచితంగా భోజనం అందిస్తూ భరోసానిస్తున్నారు. ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ పేరుతో అన్నార్తులకు అభయమిస్తున్నారు. అందుకోసం 20 ట్రక్కు వాహనాలను ఏర్పాటు చేసి మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. అందులో మూడు వాహనాలు నగరంలో తిరుగుతాయి. అనాథులు, కూడళ్లు తదితర ప్రాంతాల్లో పర్యటించి భోజనం అందిస్తారు. అంతేకాదు ఆకలితో బాధపడే వారు కనిపిస్తే తమకు సమాచారం అందించినా భోజనం ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
భోజనం ఇదే..
అన్నం, కోడిగుడ్డు, పప్పు, ఒక ఫ్రై కర్రీ, పాయసం, పాపడ్, ఏదైన ఒక పండుతో కూడిన వంటకాలతో భోజనం అందిస్తారు. ‘మేం సేవ చేస్తున్నాం’ అనే నినాదంతో లయన్స్ సభ్యులు ఈ సేవ అందించడంపై విశేష స్పందన వస్తుంది. భోజనం అందించడానికి ఫుడ్ ట్రకుల ధర, వాటిని అవసరాలకు తగ్గట్టుగా మార్చుకునే ఖర్చు అన్ని కలిపి రూ.2 కోట్లు కేటాయించి సేవ అందిస్తున్నారు. తెలంగాణలోని 33 రెవెన్యూ జిల్లాల్లో ఆహార ట్రకులు తిరుగుతాయి. వారు స్థానిక లయన్స్ క్లబ్లు, సభ్యుల మద్దతుతో పని చేస్తారు. రెండు జిల్లాలకు ఒక ట్రకు ఇస్తారు. ఒకో ట్రకులో రోజుకు 300 నుంచి 500 మందికి భోజనం అందిస్తున్నారు. మొత్తం 20 ఫుడ్ ట్రకులు కలిపి సంవత్సరానికి 28,84,000 భోజనాలను ఉచితంగా అందిస్తాయి.
మాతో కలిసిరండి
చాలా మంది సెలబ్రేషన్స్ పేరుతో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయితే వాటిని కొంత తగ్గించుకుని మేం చేసే సాయానికి మద్ధతివ్వండి. మీరు 9440081628 నెంబర్కు ఫోన్ చేస్తే మా ప్రతినిధులు మిమ్మల్ని కలిసి సాయం తీసుకుంటారు. ఆకలితో ఉన్నవారికి భరోసానివ్వడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంది.
– ఆర్. సునీల్ కుమార్,లయన్స్ క్లబ్ సభ్యులు