బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 15 : పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు, సహాయం అందించేందుకు అన్ని కోర్టుల్లో తమ సహాయ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధికా జైస్వాల్ అన్నారు. బుధవారం భోలక్‌పూర్‌లో అప్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలపై నిర్వహించిన అవగాహన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ బస్తీల్లో నివసించే నిరు పేదలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు.
తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ శాఖ, ఏఎల్వో శిరీష మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానికులకు భవన నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ పారాలీగల్ వలంటీర్లు సురేశ్‌కుమార్, ఈశ్వరమ్మ, రాజు, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, మహేశ్వర్‌రావు, అప్సా కో ఆర్డినేటర్ బస్వరాజ్, రమేశ్, శోభ పాల్గొన్నారు.
సిటీ క్రిమినల్ కోర్టు, నాంపల్లి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ):నింబోలిఅడ్డలోని బాలికల వసతి గృహాన్ని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధికా జైస్వాల్ సందర్శించారు. పరిసరాలు, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. ఏమైనా సమస్యలున్నాయా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు.