Hyderabad | బంజారాహిల్స్, జూన్ 15 : తక్కువ ధరకే కెమెరాలు ఇప్పిస్తానంటూ స్నేహితులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానగర్‌కు చెందిన ధనాల సూరజ్(27) అనే యువకుడు ఫంక్షన్స్‌లో డీజే సౌండ్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. దీంతో పాటు ఫోటోలు, వీడియోలు తీస్తుంటాడు. గత కొంతకాలంగా బెట్టింగ్‌లకు అలవాటు పడిన సూరజ్ తనకు ఈవెంట్స్‌లో పరిచయం అయ్యే కెమెరామెన్స్‌తో మాటలు కలిపి స్నేహం చేస్తుంటాడు. స్నేహితులుగా మారిన తర్వాత వారివద్ద ఉన్న కెమెరాల స్థానంలో కొత్త కెమెరాలు కొనుక్కోవాలని, తనకు తెలిసిన స్నేహితుడు రూ. 2లక్షల విలువైన కెమెరాను రూ.50 వేలకే ఇచ్చాడంటూ నమ్మబలుకుతాడు.
దీంతో తనకు కూడా కెమెరా ఇప్పించాలని కోరగా అడ్వాన్స్‌గా రూ. 20 నుంచి 30వేలు ఇవ్వాలని, కెమెరా తెచ్చిన తర్వాత మిగిలిన డబ్బు ఇవ్వాలని చెబుతాడు. డబ్బులు తీసుకున్న తర్వాత కెమెరాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తుంటాడు. ఏదో కారణం చెప్పి డబ్బులు ఎగవేస్తుంటాడు. ఈ విధంగా పలు ప్రాంతాల్లో 24 మందిని కెమెరాల పేరుతో మోసం చేసిన సూరజ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఓ బాధితుడు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు సూరజ్‌ను ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా అతడిపై వివిద పోలీస్స్టేషన్లలో 24 కేసులు నమోదయినట్లు తేలింది. 2022లో గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదయిన కేసులో అరెస్టయినట్లు గుర్తించారు. స్నేహితులను మోసం చేసి తీసుకున్న డబ్బులను బెట్టింగ్స్, ఆన్లైన్ పేకాటలో ఖర్చు చేస్తుంటానని నిందితుడు అంగీకరించాడు.