కుత్బుల్లాపూర్, జూన్ 1: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నిండా ముంచాడు. కోట్లలో వసూలు చేసి పరారైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం… నిజామాబాద్ జిల్లా పిట్టం మండలానికి చెందిన కేతావత్ సంతోష్, సుగుణ దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి కొంపల్లి మున్సిపాలిటీ జయభేరి పార్క్ బాలాజీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 204లో మూడేండ్లుగా నివాసం ఉంటున్నారు. ముందుగా పేట్ బషీరాబాద్‌లో చికెన్ సెంటర్ నడిపిస్తూ.. బల్కంపేట్‌కు చెందిన ప్రవీణ్‌ను ఆశ్రయించి లోన్ ద్వారా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నానని అందరితో పరిచయం పెంచుకున్నాడు. నిరుద్యోగులను టార్గెట్ చేసి ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు.
స్వీపర్ ఉద్యోగం నుంచి ఆఫీసర్ ఉద్యోగం వరకు ఏదైనా సరే తాను చెబితే అయిపోతుందని చెప్పుకొచ్చాడు. ముందుగా ప్రవీణ్ బంధువు నవీన్‌గౌడ్‌ను నమ్మించి ఫేక్ హాల్ టికెట్‌తో ఎయిర్ ఫోర్స్ అకాడమీ సమీపంలో తన కారులో పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత పొందినట్లుగా సర్టిఫికెట్‌ను జారీ చేస్తాడు. ఇలా పరీక్ష రాసిన నిరుద్యోగుల వద్ద నుంచి సుమారు 6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసి దాదాపు 54 మంది బాధితులను మోసం చేశాడు. అయితే నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, సిద్దిపేట జిల్లాల పరిధిలోని నిరుద్యోగులను మోసం చేసి సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేశాడు. ఈ క్రమంలో ఫేక్ కాల్ లెటర్లు పట్టుకొని బేగంపేటలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి చేరుకొని సంబంధిత అధికారులను కలిసి తమ ఉద్యోగాలు ఎక్కడ చేయాలని అడగడంతో.. సంతోష్ విషయం బయటపడింది. మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు కొంపల్లిలోని సంతోష్ నివాసానికి వెళ్లి చూడగా అప్పటికే ఇంటికి తాళం వేసి పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు.