వెంగళరావునగర్,ఫిబ్రవరి 9 : రియల్ ఎస్టేట్‌లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఓ దంపతుల నుంచి రూ.కోటిన్నరకు పైగా వసూలు చేసిన బెంగళూరుకు చెందిన ఓ స్థిరాస్తి సంస్థ ప్రతినిధులు అమెరికాకు పరారైన ఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్‌పేటలోని వెస్ట్ శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన బాతుల యుగంధర్ రెడ్డి భార్య మాధవికి బెంగుళూరుకు చెందిన వై.శ్రీనివాస్‌రెడ్డి దగ్గరి బంధువు. వై శ్రీనివాస్‌రెడ్డి అతని భార్య వై.భారతి బెంగళూరులోని హౌస్సో అండ్ హౌస్సో ప్రాజెక్ట్స్ స్థిరాస్తి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నామని యుగంధర్ రెడ్డికి చెప్పారు.
తమ సంస్థలోని వెంచర్లకు పెట్టుబడి పెడితే మంచి లాభాలు,వడ్డీ వస్తుందని చెప్పారు. బాధితులు యుగంధర్ రెడ్డి బెంగుళూరుకు వెళ్లి హౌస్సో అండ్ హోస్సో ప్రాజక్ట్స్ స్థిరాస్తి కార్యాలయాన్ని సందర్శించారు. తమ వ్యాపారం, లాభాలు, వెంచర్లను గురించి యుగంధర్ రెడ్డికి వై.శ్రీనివాస్ రెడ్డి, ఆయన భార్య భారతిలు వివరించారు. నమ్మిన యుగంధర్ రెడ్డి తిరిగి వచ్చి వివిధ మార్గాల ద్వారా శ్రీనివాస్ రెడ్డి, ఆయన భార్య భారతి చెప్పిన వేర్వేరు ఖాతాల్లోకి దశలవారీగా పెట్టుబడి పేరిట నగదు జమ చేశారు. యుగంధర్ రెడ్డి, ఆయన భార్య మాధవిలు కలిసి మొత్తం రూ.కోటిన్నరకు పైగా పెట్టుబడి పేరిట సమర్పించారు. ఈ క్రమంలో గత సంవత్సరం నవంబరు 19న బాధితు డు యుగంధర్ రెడ్డికి వై.శ్రీనివాస్ రెడ్డి ఫో న్ చేశాడు.
అమెరికా లో ఉంటున్న తమ కుమార్తె అస్వస్థతకు గురి కావడంతో తాము అమెరికా వెళ్తున్నామని తిరిగి వస్తామ ని చెప్పాడు. తిరిగి నవంబర్ 28వ తేదీన ఫోన్ చేసి త్వరలో వస్తున్నామని మరోసారి నమ్మించాడు. కాగా నవంబర్ 30వ తేదీన హోస్సో అండ్ హో స్సో ప్రాజెక్ట్స్ కార్యాలయంలో పనిచేసిన ప్రశాంత్ అనే వ్యక్తి బాధితుడు యుగంధర్‌రెడ్డికి ఫోన్ చేసి అమెరిగా వెళ్లిన వారు తిరిగి రారని, ఎంతో మందిని వారు ఇలా మోసం చేశారని సమాచారం ఇచ్చాడు. దీంతో యుగంధర్ రెడ్డి బెంగుళూరు వెళ్లి పరిశీలించగా హౌస్సో అండ్ హోస్సో ప్రాజెక్ట్స్ కార్యాలయాన్ని మూసివేసినట్టు కనిపించింది. బాధితుడు ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాత నేరస్తుడు అరెస్ట్.. 8 తులాల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం
మన్సూరాబాద్, ఫిబ్రవరి 9: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ. 12 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి వస్తువులు, 8 చేతి గడియారాలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ మక్భూల్ జానీ కథనం ప్రకారం..
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్, నూతనకల్ గ్రామానికి చెందిన అగుమండే విజయ్‌కుమార్ జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలకు పాల్పడిన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చినా అతడిలో మార్పు రాలేదు. జైలు కు వెళ్లిన సమయంలో పాత నేరస్తుడైన డేరింగుల హరిబాబుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు జైలు నుంచి విడుదలైన అనంతరం మేడ్చల్, పఠాన్‌చెరు, కీసర, మేడిపల్లి, నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో చోరీలకు పాల్పడ్డారు.
కాగా.. నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గౌరెల్లి, రుద్ర బృందావన్ కాలనీలో నివాసం ఉండే డాక్టర్ నందకిశోర్.. కుటుంబ సభ్యులతో కలిసి జనవరి మాసంలో ఇంటికి తాళం వేసి ఓ విందుకు హాజరయ్యేందుకు బయటకు వెళ్లారు. గుర్తించిన విజయ్‌కుమార్, డేరింగుల హరిబాబుతో కలిసి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకుపోయారు. డాక్టర్ నందకిశోర్ ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
నిందితుడు సోమవారం ఉదయం నాగోల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ప్రశ్నించగా దొంగతనాల విషయం బయటపడింది. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, చేతి గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. మరో నిందితుడైన డేరింగుల హరిబాబును గత నెల 26న పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.