రంగారెడ్డి, మే 13(నమస్తే తెలంగాణ): చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ..అహర్నిశలు కష్టపడ్డ బీఆర్ఎస్ కుటుంబసభ్యులకు, ప్రజా ప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధంగా భావించి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఓట్లు వేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్నికల ప్రచార యజ్ఞంలో నా వెన్నంటి నిలిచిన ప్రజలకు, నన్ను ముందుండి నడిపించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.