బడంగ్పేట్, జూలై 15: మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ, మామిడిపల్లి, మల్లాపూర్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్, అభివృద్ధి పనుల పై ఆరా తీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పనులు నత్తనడకన సాగడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చురకలు అంటించారు. డ్రైనేజీ వ్యవస్థ, సీసీరోడ్లు, స్ట్రీట్ లైట్స్, తాగునీటి సరఫరా, ఎస్ఎన్డీపీ నాలా వంటి కీలక అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడం వల్లనే పాలన వ్యవస్థలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.
డ్రైనేజీ, స్ట్రీట్ లైట్ ల సమస్యను పరిష్కరించలేని స్థితిలో మున్సిపల్ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గ్రేటర్లో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డీఈ వెంకన్న, మేనేజర్ నాగేశ్వరరావు, ఆర్వో వేణుగోపాల్ రెడ్డి, ఏఈ హరీశ్, ఏవో అరుణ, టీపీవో కిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్లు, రాకేశ్, వినయ్ ,కళ్యాణ్, యాదగిరి యాదగిరి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.