సిటీబ్యూరో, అక్టోబర్ 8: పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ చార్మినార్ జోన్‌లోని అత్తాపూర్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, మీర్ఆలం ట్యాంక్, బహదూర్‌పుర తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ, స్థితిగతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. పారిశుధ్య నిర్వహణ సజావుగా జరగాలని, ఈ విషయంలో ప్రజలు పరిశుభ్రత పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వచ్ఛ ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించేలా పర్యవేక్షించాలన్నారు.
అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను తొలగించాలని, సీ అండ్ డీ వేస్ట్‌ను ప్రత్యేక వాహనాల ద్వారా తరలించాలని సూచించారు. దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్స్, ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. అలాగే రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి వేయాలన్నారు. కమర్షియల్ స్ట్రెచెస్లో వ్యర్థాలు వెంటనే తీసుకొని పోయేలా చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌కు సూచించారు.