GHMC | సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఫ్లె ఓవర్లు.. ఆర్వోబీ.. ఆర్‌యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ..లింకు రోడ్లు.. అభివృద్ధి ఏదైనా సకాలంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే భూసేకరణ అత్యంత కీలకం. ఆయా ప్రాజెక్టు వ్యయం ఎంత ఖర్చు అవుతుందో..భూసేకరణకు అంతే స్థాయిలో వ్యయం అవుతుంది. అయితే ఆస్తుల సేకరణలో జీహెచ్ఎంసీ లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నది. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభం సమయంలోనే దాదాపు ఆస్తుల స్వాధీనంలో పై చేయిగా ఉండాలి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ భూసేకరణపై స్పష్టత లేకుండానే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయడం అధికారుల పనితీరును నిదర్శనం.
అంతేకాకుండా పురోగతిలో ఉన్న ప్రాజెక్టు పనుల్లో భాగంగా అన్నింటికీ భూసేకరణకు అయ్యే నిధుల విషయంలో స్పష్టత ఉండాలి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) వార్షిక బడ్జెట్లో హెచ్ సిటీ-1 కింద చేపట్టనున్న మొత్తం పనులకు సర్కారు రూ. 2654 కోట్లను ప్రకటించినా, ఇప్పటి వరకు కేవలం రూ.852 కోట్లకు మాత్రమే పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో స్థల సేకరణకు జీహెచ్ఎంసీ మొత్తం రూ.700కోట్లను కేటాయించింది. కానీ ఒక్క కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లను చేపట్టనున్న హెచ్ సిటీ ప్రాజెక్టు పనులకు రూ. 510 కోట్లు కేవలం స్థల సేకరణకు వెచ్చించనున్నారు.
అంతేకాకుండా బంజారాహిల్స్ విరంచి హాస్పిటల్ నుంచి కేబీఆర్ పార్కు వరకు రహదారి విస్తరణకు భూ సేకరణకు మరో రూ. 150కోట్ల ఖర్చు చేయనున్నారు. ఇక నగరంలో పలు చోట్ల హెచ్ సిటీ ప్రాజెక్టు కింద నాలాల అభివృద్ధి, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలు జరగనున్నాయి. కానీ వీటికి మాత్రం భూ సేకరణకు అయ్యే నిధులపై అధికారులకు స్పష్టత లేదు. దీంతో వచ్చే ఏడాదిలో హెచ్ సిటీ ప్రాజెక్టు పనులపై తీవ్ర ప్రభావం చూపనున్నది. భూ సేకరణకు నిధుల గండం పొంచి ఉండడంతో వచ్చే ఏడాది మొత్తంలోనూ హెచ్ సిటీ ప్రాజెక్టు పూర్తికి మోక్షం కలగడం కష్టమేనన్న అభిప్రాయాలు ఇంజినీర్లలో వ్యక్తమవుతున్నది.
పాత నగరంలో సవాల్‌గా మారిన భూ సేకరణ
గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాల కోసం చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా జీహెచ్ఎంసీ టీడీపీఆర్ పత్రాలను అందజేస్తున్నారు. అభివృద్ధి పనులకు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ఈ టీడీఆర్‌ను ఇస్తున్నారు. ఏదైన ఒక నిర్వాసితుడు నాలా విస్తరణ వల్ల ఏ మేరకు స్థలాన్ని కోల్పోయాడో, అంతకు నాలుగు రెట్లకు టీడీఆర్ పత్రాలను పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు అమీర్‌పేటలో 20 గజాల స్థలాన్ని కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు.
టీడీఆర్ పత్రం కలిగిన వారు, జీహెచ్ఎంసీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలను అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఫలితంగా లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో..టీడీఆర్ ద్వారా అంతకు రెట్టింపు లేదా, తనకు నచ్చిన మొత్తానికి విక్రయించుకొని లాభపడుతున్నారు. అయితే పాతనగరం మినహా ఇతర ప్రాంతాల్లో ఈ టీడీఆర్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. మార్కెట్లో టీడీఆర్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కానీ పాతనగరంలో మాత్రం టీడీఆర్‌లకు వద్దంటున్నారు. దీనికి వారిలో అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యమేనని చెప్పవచ్చు. మొత్తంగా పాత నగరంలో వివిధ అభివృద్ధి పనులకుగానూ ఆస్తుల సేకరణ నత్త నడకనా సాగుతున్నది.
ఎస్ఆర్డీపీలో భాగంగా జూ పార్కు-ఆరాంఘర్ ఫ్లై ఓవర్, సర్వీస్ రోడ్ల విస్తరణ, సైదాబాద్‌లో స్టీల్ బ్రిడ్జి పనుల్లో భాగంగా ఆస్తుల సేకరణే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. వీటితో పాటు నాలాల అభివృద్ధి, రహదారుల విస్తరణలో భూసేకరణ జాప్యమవుతున్నది. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం టీడీఆర్ వద్దంటున్నారంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతుండడంతో స్పెషల్ ఫండ్ కింద పాత నగరంలో భూ పరిహార బాధితులకు ప్రభుత్వం నుంచే నష్ట పరిహారం అందజేస్తూ వస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఆలస్యంగా వస్తుండడంతో ఆస్తుల సేకరణ సందిగ్ధంలో పడింది.