శనివారం 23 జనవరి 2021
Hyderabad - Dec 01, 2020 , 07:48:34

డిసెంబరు 7వ తేదీ నుంచి వరద సాయం

డిసెంబరు 7వ తేదీ నుంచి వరద సాయం

అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు మునిగి భారీగా నష్టపోయిన కుటుంబాలకు ఇప్పటికే ఓ దఫా సహాయం చేసిన ప్రభుత్వం రెండో విడతకు సిద్ధమవుతున్నది. డిసెంబర్‌ 7 నుంచి మిగిలిన వారికి నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభించనున్నది. ఇప్పటికే 6.64 లక్షల కుటుంబాలకు రూ.664 కోట్లు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మిగిలిన వారికీ అందించనున్నది. 7 నుంచి సాయం అందిస్తామని  ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.  రూ. 10 వేలను నేరుగా బ్యాంకు అకౌంట్లలోనే జమ చేసేందుకు ప్రక్రియ మొదలు పెట్టనున్నారు.

గత నెల కురిసిన భారీ వర్షాల దరిమిలా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ముంపుతో బాధపడిన ప్రతి కుటుంబానికి వరద సాయం అందనున్నది. ఇప్పటికే భారీ ఎత్తున బాధితులకు సాయం అందించిన తెలంగాణ సర్కార్‌ మిగిలిన ప్రతి ఒక్క అర్హుడికి ఈ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా బాధితులకు సాయం అందించడంలో ఇంకా రూ.300-400 కోట్లు కేటాయించేందుకైనా వెనుకాడబోమని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో సాయం అందని బాధితుల్లో భరోసా ఏర్పడింది. గ్రేటర్‌ ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచి వరద సాయం పంపిణీ ముమ్మరంగా కొనసాగించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది.

చరిత్రలో కనీ.. విని ఎరుగని రీతిలో వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తాయి. దేశంలో ఇతర రాష్ర్టాలు వరదకు తల్లడిల్లితే వేల కోట్ల రూపాయలతో ఆదుకున్న కేంద్రం.. తెలంగాణ విషయానికొచ్చే సరికి ముఖం చాటేసింది. చిల్లిగవ్వ ఇవ్వకుండా మన మానాన మనల్ని వదిలేసింది. కేంద్రం నుంచి సాయం రాకున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మనసున్న సర్కారు ఎలా ఉంటుందో చూపించింది. సీఎం కేసీఆర్‌ ఉన్నపలాన రూ.550కోట్లు విడుదల చేసి.. వరదతో బాధపడిన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున ఆదుకోమని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం వందలాది బృందాలుగా ఏర్పడి.. జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు, మూడు రోజుల వ్యవధిలోనే లక్షలాది కుటుంబాలకు నేరుగా వరద సాయాన్ని పంపిణీ చేశారు. 

వర్షం కాస్త తెరపించిన తర్వాత మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను తీసుకొని మరికొన్ని లక్షల మందికి ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోనే వరద సాయాన్ని జమ చేసింది. కానీ కొన్ని శక్తులు పేదలకు అందుతున్న సాయాన్ని అడ్డుకున్నాయి. పేదవాడి నోటికాడి బుక్కను గుంజి పడేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి.. బాధిత కుటుంబాలకు దక్కాల్సిన రూ.పదివేల వరద సాయాన్ని నిలిపివేయించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఏకంగా 6.64 లక్షల కుటుంబాలకు రూ.664 కోట్ల వరద సాయాన్ని ప్రభుత్వం అందించింది.

సర్కార్‌ చిత్తశుద్ధి

 వరద సాయం పంపిణీలో చివరి అర్హుడి వరకు అందించాలనే కృత నిశ్చయంతోనే తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావడంతో తాత్కాలిక బ్రేక్‌ పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన ఎల్బీస్టేడియంలో జరిగిన ప్రగతి శంఖారావం వేదికగా సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన వరద సాయం అందని అర్హుల్లో భరోసా నింపింది. ఇప్పటికే 6.64లక్షల మందికి సాయం అందించిన ప్రభుత్వం.. మరో రూ.300-400 కోట్ల సాయాన్ని అందించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకకుపోదని సీఎం కుండబద్దలు కొట్టారు. అయితే ఎన్నికలు ముగియగానే తిరిగి ఈ నెల 7న వరద సాయం పంపిణీని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముందు నుంచి అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 ఈ  పంపిణీలో ఏకంగా మరో నాలుగు లక్షల బాధిత కుటుంబాలకు సాయం అందనున్నది. అందుకే అధికార యంత్రాంగం ఇప్పటికే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న, ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ నెల ఏడో తేదీ తర్వాత మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క అర్హుడికి ఆర్థిక శాఖ నుంచి నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలోనే రూ.10వేలు పడనున్నదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో దేశ చరిత్రలో ఇప్పటివరకు అనేక మహా నగరాల్లో.. అనేక సార్లు వరదలు వచ్చినా ఈస్థాయిలో నేరుగా బాధిత కుటుంబాల్ని ఆదుకున్న దాఖలాలు లేవని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ.800కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు వరద సాయం కింద పంపిణీ అందించడమనేది రికార్డుగా ఆయన అభివర్ణించారు.


logo