బంజారాహిల్స్,జూలై 7 : కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆస్పత్రికి వచ్చిన ఐదేళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందడంతో బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని టీఎక్స్ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలం మెండపల్లి గ్రామానికి చెందిన సిరిసాట్ తులసీరామ్(5) అనే బాలుడు కొంతకాలంగా ఆస్టియోమైలైటిస్( బోన్ ఇన్ఫెక్షన్) అనే జబ్బుతో బాధపడుతున్నాడు. ఎనిమిది నెలల క్రితం బంజారాహిల్స్ రోడ్ 12లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరగా సర్జరీ నిర్వహించారు. సర్జరీ విజయవంతం కావడంతో కొన్నిరోజులుగా కోలుకుంటున్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం బాబు కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో కుటుంబసభ్యులు మరోసారి టీఎక్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాలుడి కాలుకు శస్త్రచికిత్స నిర్వహించారు.
అనంతరం బాలుడి కాలు మొత్తం నీలంగా మారింది. ఈ క్రమంలో రాత్రి 11గంటల ప్రాంతంలో బాలుడికి మరోసర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బాబుకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఉదయం 8 గంటల ప్రాంతంలో బాబు చనిపోయాడని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడంటూ బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం జరిగిందని భావిస్తే ఫిర్యాదు ఇవ్వాలని, కేసు నమోదు చేసి విచారణ చేస్తామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర సూచించారు. కాగా ఆస్పత్రి యాజమాన్యం స్పందించి నష్టపరిహారం అందించడంతో బాలుడి మృతదేహాన్ని తీసుకుని బంధువులు వెళ్లిపోయారు.