Hyderabad | చర్లపల్లి, మే 18 : కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడ ఐవోసీఎల్ పరిశ్రమ ప్రధాన రహదారిపై డీజిల్ ట్యాంకర్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
చర్లపల్లి పారిశ్రామికవాడలో ఐవోసీఎల్ పరిశ్రమ వద్ద గత రెండు నెలల నుంచి భవాని ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఏపీ 29 డబ్ల్యూ 0279 ట్యాంకర్ నిలిపి ఉంచారు. అయితే ఆదివారం లారీని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడికి లారీని కొనుగొలు చేసేందుకు వచ్చిన మదనపల్లికి చెందిన రవిగౌడ్ తన క్లీనర్ మహ్మద్ ఫెరోజ్ఖాన్తో కలిసి లారీని ట్రయల్‌రన్ చేసేందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా లారీకి చెందిన డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన రవిగౌడ్, క్లీనర్ లారీ నుంచి కిందకు దూకారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు ప్రమాదాన్ని గమనించి స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంకి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రహదారిపై వాహనాలు రాకుండా జాగ్రత్తలు చేపట్టడంతో అగ్ని మాపక సిబ్బంది లారీకి అంటుకున్న మంటలను అర్పివేశారు. ఈ క్రమంలో రెండు సిలిండర్ లారీలు పాక్షికంగా అగ్నిప్రమాదానికి గురికాగా ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.