హైదరాబాద్: నగరంలోని బాలానగర్‌లో (Balanagar) భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలానగర్‌లోని చెన్నారెడ్డి నగర్లో ఉన్న ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తం విస్తరించాయి. దీంతో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కంపెనీలో మంటలు చెలరేగడంతో కార్మికులు బయటకు పరుగెత్తారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కాగా, గతంలో ఇదే కంపెనీలో రెండు సార్లు అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే పరిశ్రమలో ప్రమాదాలు జరగుతున్నాయని చెప్పారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.