సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): పైరసీ రాకెట్ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులను సినీ ప్రముఖులు అభినందించారు. సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు వివిధ విభాగాల అధికారులతో సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, నాని, రామ్, దిల్‌రాజు, దగ్గుబాటి సురేశ్, సుప్రియ తదితరులు సమావేశమయ్యారు. పైరసీ జరుగుతున్న విధానంపై సీపీ వారికి సమగ్రంగా వివరించగా నేరగాళ్లు ఎలా హ్యాక్ చేస్తున్నారో తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు.
టెక్నాలజీ పెరుగుతున్న తీరులోనే వారు పైరసీ చేస్తున్నారని, వారిని పట్టుకోవడానికి పోలీసులు చూపిన శ్రద్ధ, నిందితుల అరెస్ట్ సమయంలో పోలీసులకు ఎదురైన అనుభవాలు తెలుసుకుని వారి శ్రమను అభినందించారు. ఇటీవల దర్యాప్తులో నిందితులు తెలిపిన వివరాలను సీవీ ఆనంద్ వారికి చెబుతూ పైరసీకి నిందితులు ప్రధానంగా రెండు ప్రాథమిక పద్ధతులు పాటిస్తున్నారని, మొదటిది మొబైల్ ఫోన్లతో రికార్డింగ్ చేయడం కాగా రెండవది సైబర్ నేరస్తులు డిజిటల్ పంపిణీ వ్యవస్థను హ్యాక్ చేసి విలువైన స్టూడియో కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసి కాపీ చేశారని ఆనంద్ చెప్పారు.
థియేటర్ యజమానులు ఆన్‌గ్రౌండ్ విజిలెన్స్‌ను బలోపేతం చేయాలని, రికార్డింగ్ పరికరాల వాడకాన్ని పరిమితం చేయాలని అంతేకాకుండా ఇన్హాల్ పైరసీ ప్రయత్నాలను నిరోధించడానికి అధునాతన నిఘాను ఫాలో కావాలని ఆనంద్ సినీ పరిశ్రమకు సూచించారు. కంటెంట్ , రొబస్ట్ ఫోరెన్సిక్స్, వాటర్మార్కింగ్ల కోసం చైన్కస్టడీని వినియోగించాలని ప్రొడక్షన్ యూనిట్లకు చెప్పారు. ఈసమావేశంలో క్రైమ్స్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, డీసీపీ దారాకవిత తదితరులు పాల్గొన్నారు.
పైరసీతో అందరికీ నష్టమే
– ఎఫ్డీసీ చైర్మన్ దిల్‌రాజు
పైరసీ వెనక బెట్టింగ్ యాప్‌ల పాత్ర ఉందని, ఇకపై ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయరని ప్రముఖ సినీ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. పైరసీని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కట్టడి మాత్రం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్‌ను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నందుకు సినీనిర్మాతలు, సినీ ప్రముఖులు వారిని అభినందించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో సీపీ సీవీ ఆనంద్ నిర్వహించిన సమావేశంలో సినీనిర్మాతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌సీసీ చైర్మన్ దిల్‌రాజు స్పందిస్తూ పైరసీ రాకెట్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించారు. పైరసీ వల్ల జరుగుతున్న నష్టం కేవలం నిర్మాతలకే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తున్నదని రాజు చెప్పారు. సినిమా ప్రదర్శనకు సంబంధించిన క్యూబ్, యూఎఫ్ఓ వంటి ప్రముఖ డిజిటల్ ప్రొవైడర్ల సర్వర్లను కూడా పైరసీ ముఠాలు హాక్ చేస్తున్నాయని పోలీసుల విచారణలో తేలినట్లు దిల్‌రాజు తెలిపారు.
ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిలో బీహార్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు ఉండడం, అతను కిక్ కోసం ఇలా చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. ఈ హ్యాకింగ్ల వెనక ఉన్న అసలు కారణాలు గేమింగ్ యాప్‌ల బాధితులుగా ఉన్న యువతే అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రతీ సినిమాపై 18శాతం జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందిస్తున్నామని, అలాంటిది పైరసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా పెద్ద మొత్తంలో గండిపడుతున్నదన్నారు.
సినిమాను పైరసీ బారి నుంచి కాపాడేందుకు కొత్త అప్డేట్లు తీసుకొస్తున్నప్పటికీ హ్యాకర్లు అంతకుమించిన కొత్తమార్గాల్లో దొంగతనం చేస్తున్నారని, ఈ బెడదను అరికట్టేందుకు పోలీసులతో కలిసి కొత్త అప్డేట్ల కోసం చర్చలు జరుపుతున్నామని దిల్ రాజు పేర్కొన్నారు. సినిమా తీసే వారిలో 95 శాతం మంది నష్టపోతుండగా, కేవలం ఐదుశాతం మంది మాత్రమే విజయం సాధిస్తున్నారని, వారికి కూడా ఈ పైరసీ తిప్పలు తప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా థియేటర్లో విడుదలైన వెంటనే పైరసీ కాపీ ఇంటర్నెట్లో దర్శనమిస్తోందని, దీని వల్ల నిర్మాతలకు , పంపిణీదారులకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో, అంతే వేగంగా పైరసీ పెరుగుతున్నదని, దీనికి గట్టి కట్టడి అవసరమని పోలీసులను దిల్ రాజు కోరారు.