సిటీబ్యూరో, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో సినీనటీమణుల పేర్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్న సంఘటనపై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, యూసుఫ్‌గూడ సర్కిల్-19 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ యాహియా కమల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో సినిమా నటులు ఓటరు జాబితాలో ఉన్నారనంటూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదులో ఏఈఆర్వో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్ధారించని తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు.