Cyber Crime | సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వన్‌టైమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీంలో రూ. 21 వేలు పెట్టుబడి పెడితే నెలకు లక్షల్లో లాభాలొస్తాయంటూ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు ఏఐతో ఫేక్ వీడియోలు తయారు చేసిన సైబర్‌నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోను ఫేస్బుక్లో చూసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ. 3.20 లక్షలు పొగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే .. రామంతాపూర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫేస్బుక్లో మార్చి నెలలో ఒక వీడియోను చూశాడు.
అందులో నిర్మలా సీతారామన్ చెప్పినట్లు రూ.21 వేల వన్‌టైమ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే లక్షల్లో లాభాలొస్తాయంటూ వీడియో ఉంది (ఫేక్ వీడియో).. ఆ వీడియో లింక్‌ను బాధితుడు క్లిక్ చేసి అందులో దరఖాస్తు ఫారాన్ని నింపాడు.. రెండు మూడు రోజుల తరువాత తాను ఇన్వెస్ట్మెంట్ ఏజెంట్‌నని, మీరు పంపిన దరఖాస్తు తమకు అందిందంటూ ఒక గుర్తుతెలియని వ్యక్తి మాట్లాడాడు. మీరు ముందుగా ఫిన్డెక్సా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆ తరువాత తమ ఏజెంట్ మీకు సలహాలు సూచనలు ఇస్తారంటూ నమ్మించారు.
కొది ్దసేపట్లోనే మరో మహిళ ఫోన్ చేసి తన పేరు స్నేహారెడ్డి అని మీరు ఈ స్కీమ్‌లో రూ. 21,675 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, మొదటి రోజు నుంచే లాభాలు వస్తాయంటూ నమ్మించింది. దీంతో బాధితుడు ఆ డబ్బును డిపాజిట్ చేయడంతో మొదటి రోజు రూ. 1,265 మీకు లాభం వచ్చిందని వాటిని విత్ డ్రా చేసుకోవాలంటూ సూచించారు. అయితే అప్పటికే రెండు మూడు రోజులు ఈ స్కీమ్ గూర్చి బాధితుడు ఆలోచించి ఆ యాప్‌లో పెట్టుబడి పెడితే లాభాలుస్తున్నాయనే భ్రమలోకి వెళ్లి ఏజెంట్లు చెబుతుంది నిజమని నమ్మేశాడు.
అవన్నీ ఫేక్ వీడియోలు..
ప్రముఖులు చెప్పినట్లు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో ఫేక్ వీడియోలు తయారు చేస్తూ సైబర్‌నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని సైబర్‌క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థలు ఆన్లైన్లో చీటింగ్ చేసేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారని, అందులో ప్రముఖులు చెప్పినట్లు వీడియోలు తయారు చేయడం కూడా ఒక తరహా స్వభావమని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి వీడియోలను చూసి మోసపోవద్దని, అవన్నీ ఫేక్ అని గుర్తించాలంటూ చెబుతున్నారు.
రోజుకోసారి యాప్‌ను ఓపెన్ చేయాలి…
మీరు రోజు యాప్‌ను ఒక్కసారైనా ఓపెన్ చేయాల్సి ఉంటుందని, మీకు వచ్చే లాభం డాలర్ల రూపంలో అందులో ఎప్పటికప్పుడు డిపాజిట్ అవుతూ ఉంటుందని నమ్మించారు. వాళ్లు చెప్పినట్లే కొన్ని రోజులు యాప్‌ను ఓపెన్ చేస్తూ వెళ్లాడు.. ఆ యాప్‌లో తన లాభాలు స్క్రీన్‌పై పెరుగుతూ కన్పించాయి. కన్పించిన లాభాలు మాత్రం విత్ డ్రా చేసుకునే అవకాశం లేదు.. ఇలా కొన్ని రోజుల విరామం తరువాత బాధితుడికి నేరగాళ్లు ఫోన్ చేశారు.. మీరు ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే చాలా లాభాలు వస్తాయని, గ్యాప్ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయండంటూ సూచనలు చేశారు. వాళ్లు చెప్పిన మాటలు విన్న బాధితుడు రూ. 3 లక్షలు డిపాజిట్ చేశాడు. మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి వారానికి ఒక రోజు బుధవారం మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశముంటుందంటూ సూచించారు. మీరు రూపాయలలో డిపాజిట్ చేస్తే…
అవి డాలర్లలోకి కన్వర్ట్ అవుతాయని, అవే యాప్‌లో స్క్రీన్‌పై కన్పిస్తాయంటూ నమ్మించారు. ఈ క్రమంలోనే వారం రోజుల తరువాత రూ. 29,505 విత్ డ్రా చేయడానికి అవకాశమిచ్చారు… మీరు విత్‌డ్రా చేసుకోండంటూ సూచించారు, యాప్‌లో నుంచి విత్‌డ్రా అయి, అవి బాధితుడి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయినట్లు యాప్‌లో సూచించింది. తీరా బ్యాంకు ఖాతా చూస్తే అందులో డబ్బులు డిపాజిట్ కాలేదు. దీనిపై యాప్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే అలాంటేదేమి లేదు.. ఎదైనా టెక్నికల్ సమస్యలుండొచ్చు.. మీ డబ్బు ఎక్కడా పోదూ..ఇంకా పెట్టుబడి పెట్టండి.. మీకు మరో ఏజెంట్‌ను అప్పగిస్తామంటూ నమ్మించారు. అప్పటికే బాధితుడికి ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి తన బ్యాంకులో ఆరా తీశాడు. బ్యాంకు అధికారులు ఇదంతా మోసమని చెప్పడంతో బాధితుడు 1930కు ఫోన్‌కు ఫిర్యాదు చేసి, అనంతరం రాచకొండ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.