బంజారాహిల్స్/సిటీబ్యూరో, మే 1(నమస్తే తెలంగాణ): ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీల ప్రకటనలను కాపీ చేసి వినియోగదారులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని తాడేపల్లిగూడేనికి చెందిన మున్వర్ భాషా సిమ్‌కార్డు ప్రమోటర్, ఫీల్డ్సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.
తనకిచ్చిన సిమ్‌లను తప్పుడు చిరునామాలతో దుర్వినియోగం చేస్తూ మ్యూల్ సిమ్కార్డులుగా మారుస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఈక్రమంలోనే ఓఎల్ఎక్స్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని యాపిల్ వంటి కంపెనీల ప్రకటనల కంటెంట్‌ను కాపీ చేసి తన సొంత ప్రకటనలుగా మారుస్తున్నాడు. దీంతో వినియోగదారులు వాటిని నమ్మి పెద్దమెత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో మూడు వేర్వేరు ఫోన్ నంబర్లను ఉపయోగించి మున్వర్ 14 కేసుల్లో అక్రమాలకు పాల్పడ్డాడు. సైబర్ సెల్, వెస్ట్ జోన్ సాయంతో బంజారాహిల్స్ పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.