పహాడీషరీఫ్, మే 29: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి పోలీస్ అవతారమెత్తాడు. హైవే పోలీస్‌గా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పహాడీషరీఫ్ పీఎస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, డీఐ కాశీ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. జియాగూడకు చెందిన శ్రీశైలం 28న ఉదయం పల్సర్ బైక్‌పై శ్రీశైలం వెళ్తున్నాడు.
సర్దార్‌నగర్ గేట్ సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. దెబ్బలు తగలడంతో రోడ్డు పక్కనే కూర్చున్నాడు. అదే సమయంలో సర్దార్‌నగర్‌కు చెందిన తాళ్ల పాండు(42) బాధితుడిని చూసి దగ్గరికి వెళ్లాడు. అతడు తాగిన మత్తులో ఉన్నాడు. అది గమనించిన పాండు.. తాను పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైవే పోలీసునంటూ పరిచయం చేసుకున్నాడు. మద్యం మత్తులో బైక్ నడిపావంటూ బెదిరించాడు. కేసు పెడితే నెల రోజులు జైలుకు వెళ్తావని హెచ్చరించాడు. వాహనాన్ని సైతం శాశ్వతంగా సీజ్ చేస్తామన్నాడు. కేసు బుక్ చేయకుండా ఉండాలంటే రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడి సోదరుడి ద్వారా రూ. 20 వేలు తీసుకున్నాడు. అనుమానంతో బాధితుడు మరుసటి రోజు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.20వేలు నగదు రికవరీ చేశారు. ఈ సమావేశంలో ఎస్సై వెంకటయ్య, హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, పరశురాం ఉన్నారు.