మీకు ఫేస్ బుక్‌లో అకౌంట్ ఉన్నదా.. అయితే తస్మాత్ జాగ్రత్త. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఫేస్ బుక్‌ను టార్గెట్ చేశారు. యాక్టీవ్‌గా ఉండే వారి అకౌంట్ పేరున మరో నకిలీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. అందులో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ అత్యవసరంగా డబ్బులు కావాలని మెసేజ్ పంపుతున్నారు. తన ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడని ఎవరైనా స్పందిస్తే.. ఇక వారి పని అంతే. నకిలీల బారిన పడకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే.
ఫేక్ అకౌంట్ కనిపిస్తే రిపోర్ట్ చేయించాలి.. కొంత కాలం కిందట ఓ జిల్లా ఎస్పీనుంచి కొందరికి ఫేస్బుక్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఎస్పీ అంతటి వ్యక్తినుంచి రిక్వెస్ట్ ఎవరు వద్దనుకొంటారు. వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత ఎస్పీ అకౌంట్నుంచి రెండు, మూడు కొటేషన్లు రావడంతో ఫిదా అయిపోయారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. డబ్బు కావాలి త్వరలోనే సర్దుతానని మెసేజులు వచ్చాయి. దీంతో ఖంగుతిన్న సదరు వ్యక్తులు విషయాన్ని పోలీసుల దృష్టికి తేవడంతో ఇది నకిలీల పనేనని తేలింది. ఇలా ఒకటికాదు రెండు కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు వెయ్యికిపైగా కేసులు పోలీస్స్టేషన్లలో నమోదు అవుతున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 4 : (నమస్తే తెలంగాణ) : ఫేక్ అకౌంట్లు ఎంతటి నష్టం కలిగిస్తున్నాయో ఇటీవలకాలంలో ఫేస్బుక్ వినియోగదారుల్లో చాలామందికి అనుభవంలోకి వస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మంచి ఉద్యోగం లేకపోతే వ్యాపారం ఉండి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారే నకిలీల టార్గెట్. ఆ వ్యక్తులు వివిధ సందర్భాల్లో అప్లోడ్ చేసిన ఫొటోలను సేకరించి, అచ్చం అదే పేరు, వారి ఫొటోలతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేస్తున్నారు. పాత ఫొటోలను ఉపయోగించుకొని నాలుగైదు పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ తర్వాత వారి ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నవారికి, ఇతరులకు రిక్వెస్ట్‌లు పంపుతున్నారు.
యాక్సెప్ట్ చేయగానే హాస్పిటల్లో ఉన్నాననో లేదా ఏదో ఒక కారణం చెప్పి డబ్బు అత్యవసరంగా కావాలని, ఒకటి రెండు రోజుల్లోనే ఇచ్చేస్తానని మెసేజ్ పంపుతున్నారు. ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్ ఇచ్చి మరీ డబ్బు అడుగుతున్నారు. ఒక్కసారి డబ్బు వేస్తే.. ఇక అంతే. ఇలా ఫేక్ అకౌంట్లను నమ్మి వేలకు వేలు పోగొట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పోలీసులకు ఇలాంటివి రోజుకు వెయ్యికిపైగా ఫిర్యాదులు వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లను కట్టడిచేసేందుకు నిపుణులు పలుమార్గాలు సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మీ పేరుపై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినట్టు గుర్తిస్తే వెంటనే అందరికీ తెలియజేయాలని స్పష్టం చేస్తున్నారు.
నకిలీ అకౌంట్‌ను సృష్టించే కేటుగాళ్లకు మీ ఫ్రెండ్సే టార్గెట్. కాబట్టి మీ ఫ్రెండ్స్ లిస్ట్ ఇతరులకు కనిపించకుండా ‘హైడ్’ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఫ్రెండ్స్ లిస్ట్ దగ్గర ఆప్షన్స్‌లో ‘ఎడిట్ మై ప్రైవసీ’లోకి వెళ్లి ‘హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్స్ లిస్ట్’లో ‘ఓన్లీ మీ’ అని ఎంచుకోవాలి.
మీ టైమ్‌లైన్‌పై పోస్ట్ చేసే ఫొటోల భద్రతకు మీదే బాధ్యత. కాబట్టి ఫొటోలను కేవలం మీ స్నేహితులు మాత్రమే చూసేలా ఆప్షన్లలో ‘ఎడిట్ పోస్ట్ ఆడియన్స్’లో ఫ్రెండ్స్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
మీ అకౌంట్‌ను భద్రంగా ఉంచుకోవడానికి చివరి ఆప్షన్‌గా మాత్రమే దీన్ని వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొఫైల్ లాక్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు.
ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేముందే ఒకటికి రెండుసార్లు హిస్టరీ చెక్ చేసుకోవాలి. ఒకరిద్దరు రిపోర్ట్ కొడితే ఫేస్బుక్ టూల్స్ పెద్దగా స్పందించవు. కనీసం 20 మంది దాటితే ఆటోమేషన్ నుంచి మ్యాన్యువల్ స్టేజ్‌కి వెళ్తుంది. ఫేస్బుక్ ఉద్యోగి ఆ అకౌంట్‌ను చెక్ చేసి చర్యలు తీసుకుంటారు. 99శాతం సందర్భాల్లో ఇది విజయవంతమైంది. – నల్లమోతు శ్రీధర్, ప్రముఖ ఐటీ నిపుణుడు
అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే వెనుకాముందు ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసేవాళ్లు ఎందరో ఉన్నారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు పద్ధతిగా చాటింగ్ చేసి.. ఆ తర్వాత డబ్బులు, వస్తువులు అడుగుతారు.
ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఆ అకౌంట్ క్రియేట్ చేసి ఎన్ని రోజులైంది? ఫ్రెండ్స్ ఎంతమంది? టైమ్‌లైన్ పోస్టులు వంటివి చెక్ చేయాలి. వారం పది రోజుల కింద అకౌంట్ మొదలు పెట్టి, 10-15మంది ఫ్రెండ్స్ ఉండి, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఒకరిద్దరు మాత్రమే ఉంటే అనుమానించాలి.
ప్రముఖుల ఫొటోలతో అకౌంట్ క్రియేట్ చేసి, ప్రొఫైల్ లాక్ చేసి రిక్వెస్ట్ పంపుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మొహమాటానికి పోయి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు.