GHMC | సిటీబ్యూరో: కోటికి మందికి పైగా జనాభా కలిగిన నగరంలో పౌరులకు మౌలిక వసతుల కల్పన, మెరుగైన సేవలందించడంతో బల్దియాదే ముఖ్య భూమిక. అలాంటి కీలకమైన శాఖకు రెగ్యులర్ కమిషనర్‌గా పట్టుమని రెండేండ్లు ఉండటం లేదు. అలా వచ్చి .. ఇలా వెళ్తున్నారు. రోనాల్డ్ రాస్ మొదలుకొని ఆమ్రపాలి వరకు గడిచిన 11 నెలల్లోనే జీహెచ్ఎంసీకి ఇద్దరు కమిషనర్లు మారారు. గత జూన్ నెలలో రెగ్యులర్‌గా ఉన్న రోనాల్డ్ రాస్ బదిలీపై ఇంధన శాఖకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో వచ్చిన ఆమ్రపాలి నాలుగు నెలలు గడవకముందే జీహెచ్ఎంసీనే కాదు రాష్ర్టాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది. గత నెల 17న రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తిని ఎఫ్ఏసీ కమిషనర్‌గా జీహెచ్ఎంసీకి ప్రభుత్వం నియమించింది.
ఈ నేపథ్యంలోనే గత వారంలో ఇలంబర్తి ఝార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఆయన అక్కడి నుంచే అధికారులతో టచ్‌లో ఉంటూ.. ఆన్లైన్ (ఈ-ఆఫీస్/వాట్సాప్) ద్వారా పాలనా వ్యవహారాలు చూస్తూనే వస్తున్నారు. అయితే కొన్ని టౌన్ ప్లానింగ్, కొత్త విధానాలు, ఇతర కీలకమైన ఫైళ్లను ఆయన చూడలేకపోతుండటంతో పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయి. అదే రెగ్యులర్ కమిషనర్ ఉంటే సరైన నిర్ణయాలు ఉంటాయి. ఎఫ్ఏసీ కమిషనర్ కావడంతో కొందరు ఉన్నతాధికారులు ఇదే అదనుగా సంస్థగత లోపాలను ఆసరాగా చేసుకొని దందాకు తెరలేపారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పాలన గాడితప్పడం, ప్రజా సమస్యలు పెరిగిపోవడం, అవినీతి అధికారులు అడ్డదారిలో కీలక స్థానాలను దక్కించుకుంటూ, పనిచేసే అధికారులు అప్రాధాన్యత పోస్టుల్లో ఉంటుండడం రాబోయే రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందోనని ప్రజలు అందోళన చెందుతున్నారు.
ఇటీవల ఇద్దరు డిప్యూటీ కమిషనర్ల(డీసీ) బదిలీల్లో ఓ డీసీ అంశం ఉద్యోగుల్లో విస్తృత చర్చకు దారి తీసింది. జీహెచ్ఎంసీతో పాటు శివారులోని ఆదాయం ఉన్న మున్సిపాలిటీల్లో కమిషనర్‌గా సదరు డీసీ పనిచేశారు. గతంలో ఆయన ఖైరతాబాద్ డీసీగా పని చేశారు. అకడి నుంచి నిజాంపేట కార్పొరేషన్లో కమిషనర్‌గా పోస్టింగ్ తెప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు లీవ్‌లో వెళ్లారు. తర్వాత పైరవీతో పీర్జాదిగూడ కార్పొరేషన్ కమిషనర్‌గా వచ్చారు. అకడ మళ్లీ లీవ్‌లో వెళ్లి బల్దియాలో అత్యధిక ఆదాయం వచ్చే సరిల్ చందానగర్‌లో పోస్టింగ్ ఇప్పించుకున్నారు. కాగా, ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను గత కమిషనర్ ఆమ్రపాలి బదిలీలు చేశారు. అయితే చాలా మంది పలుకుపడి ఉపయోగించి తిరిగి అదే పోస్టింగ్ దక్కించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది ఉద్యోగులు పైరవీలతో వచ్చినట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. అడ్మిన్ విభాగంలో కీలక అధికారి అన్నీ తానై ఈ వ్యవహారాలను చక్క పెడుతున్నట్లు వినికిడి.
బిగ్ బ్రదర్స్ అయ్యప్ప సొసైటీపై తమ మార్ చూపించడంతో సదరు డీసీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. బిగ్ బ్రదర్స్ అక్రమ నిర్మాణదారులను తమకు కూడా కప్పం కట్టాలి అనడంతో అప్పటికే తాము డీసీకి చెల్లించాం అని చెప్పడంతో అకడ లొల్లి మొదలైంది. ఇంకా ఇకడే ఉంటే ఇబ్బందుల్లో పడతామని స్టడీ లీవ్‌లో వెళ్లారు. మళ్లీ సదరు డీసీకి మూసాపేటలో పోస్టింగ్ వచ్చింది. లీవ్‌లు పెట్టి.. మంచి పోస్టింగ్ కోసం వెయిట్ చేసే వారికి అధికారులు అందలం వేయడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జి కమిషనర్ లేకున్నా అడిషనల్ కమిషనర్ అడ్మిన్ తన అనుకున్న వారికి మంచి పోస్టింగ్‌లు ఇవ్వడంపై నిరసన వ్యక్తమవుతున్నది. అయితే కమిషనర్ పరిశీలనలో పెట్టి ఆయన అనుమతితో పోస్టింగ్ ఇవ్వొచ్చు అని అడ్మిన్ విభాగం చెబుతున్నది.