బెదిరింపులు.. దారిదోపిడీలు!
సనత్‌నగర్‌లో ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా ఆదివారం సాయంత్రం పోలీసులు అతనిని ఆపారు.
- వందల నుంచి లక్షల వరకు వసూళ్లు..
- పోలీసులపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
- మొన్న ఫిల్మ్‌నగర్.. నిన్న సనత్‌నగర్
- నగర పోలీసు వ్యవస్థలో వరుస వివాదాలు
సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): షేక్‌పేటలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి బ్యాగులో నగదు ఉన్నట్లు కనిపెట్టిన పోలీసులు అతనిని ఆపి బ్యాగులో ఏముందని ప్రశ్నించారు. ఆ తర్వాత వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి అతనిని బెదిరించి తనకు అవసరముండి అప్పు చేసి తీసుకున్నానని చెబుతున్నా వినకుండా బాధితుడి దగ్గర నుంచి బలవంతంగా రూ.50వేలు ఫిల్మ్‌నగర్‌కు చెందిన ఇద్దరు పోలీసులు లాక్కున్నారని బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదై కానిస్టేబుల్, హోంగార్డులను రిమాండ్‌కు పంపారు. సూత్రధారిగా ఉన్న ఎస్సై మాత్రం ఈ కేసు నుంచి తన పేరు లేకుండా చేసుకున్నట్లు సమాచారం.
సనత్‌నగర్‌లో ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా ఆదివారం సాయంత్రం పోలీసులు అతనిని ఆపారు. వాహనానికి సంబంధించి అతనిని బెదిరించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ రూ.3వేలు ఇస్తే బండి వదిలేస్తామని చెప్పినప్పటికీ వాహనదారుడితో బేరం కుదరకపోవడంతో కొద్ది సేపు సతాయించారు. చివరకు రూ.1000లు తీసుకుని అతనిని వదిలేశారు. పోలీసు స్టేషన్‌కు తరలించిన వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి డబ్బులు తీసుకున్నారంటూ బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దీనిని చూసి ఉన్నతాధికారులు అతనిని పిలిచి ఫిర్యాదు తీసుకుని ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుపై బెదిరింపుల కేసు పెట్టారు.
ఐదురోజుల కిందట సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ ఒక వ్యక్తికి సంబంధించిన ద్విచక్రవాహనాన్ని ఆపి అతనిని ఫోటో దించడానికి ప్రయత్నం చేశారు. వద్దంటూ ఆ వాహనదారుడు బతిమలాడడంతో తనకు ఏంటని అడిగాడు. దీంతో వాహనదారుడు రూ.300 ఫోన్‌పే ద్వారా ఆ కానిస్టేబుల్‌కు పంపించారు. ఇదంతా అయిపోయిన తర్వాత సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఇవన్నీ హైదరాబాద్ కమిషనరేట్‌లో కేవలం వారం రోజులలోపు జరిగిన సంఘటనలే. ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నా వెలుగుచూస్తున్నవి మాత్రం కొన్నే.
రోడ్డు మీద వాహన తనిఖీ మొదలు పోలీసు స్టేషన్లో కేసు పరిష్కారం వరకు అధికారాన్ని ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వేర్వేరు స్థాయిల్లో వెలుగుచూస్తున్నాయి. అందులోనూ బెదిరింపులకు పాల్పడి వసూలు చేస్తున్నారంటూ కొందరు పోలీసులపై మొదటినుంచి ఆరోపణలు ఉన్నప్పటికీ డబ్బుల సంచీ చూసి గుంజుకున్న కేసు మాత్రం షేక్‌పేటలో జరగడం మొత్తం కమిషనరేట్‌లోనే చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా సీపీ సజ్జనార్ మాత్రం ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప కమిషనరేట్‌లో పోలీసుల తీరుపై సీరియస్‌గా స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనధికారికంగా సెటిల్మెంట్లు
నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థ నేరాల నియంత్రణలో చాలా కీలకమైనది. అనుమానితులను గుర్తించడం, నేరాలు జరగకుండా నిరోధించడం, రాత్రివేళల్లో ప్రజలకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ విధుల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేయడం కూడా ఒక భాగమే. అయితే తనిఖీ అధికారాన్ని వ్యక్తిగత సంపాదనకు ఉపయోగించుకునే అవకాశం లేకున్నప్పటికీ ఫిల్మ్‌నగర్ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతూ దారిదోపిడీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కేసు నమోదైనా అందులో కీలక పాత్రధారిగా ఉన్న ఎస్సైపై మాత్రం ఎలాంటి చర్యలూ లేవు.
ముఖ్యంగా ఈ సంఘటన అంతా అసలు వారికి సంబంధం లేని సెక్టార్లో జరగడం గమనార్హం. బాధితుడిని భయపెడితే అతను మాట్లాడకుండా వెళ్లిపోతాడనుకున్న పోలీసులకు అతను రివర్సయ్యాడు. రెండురోజుల తర్వాత వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన విషయం తెలిసిన వెంటనే ఆ ఎస్సై సదరు కానిస్టేబుల్‌కు చెప్పి పారిపొమ్మనడం, అతను పరారీ అవ్వడంతో ఫిల్మ్‌నగర్ పోలీసుల్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో ఎస్సై బాగోతాన్ని, కానిస్టేబుల్ పరారీని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది.
దీంతో పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను తీసుకొచ్చి రిమాండ్‌కు పంపారు. కానీ ఇప్పటివరకు ఎస్సైపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇందుకు అతనికి వెన్నుదన్నుగా నిలుస్తున్న కమిషనరేట్‌లోని ఒక ఉన్నతాధికారేనంటూ పీఎస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సనత్‌నగర్‌లో జరిగిన కేసులో పోలీసులే ఆ వాహనదారుడి నుంచి డబ్బులు తీసుకోవడం బెడిసికొట్టింది. అతను సోషల్‌మీడియాను ఉపయోగించుకుని తన బాధను వ్యక్తపరచడంతో సనత్‌నగర్ ఉన్నతాధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
అతనిని పిలిచి ఫిర్యాదు తీసుకుని ఆ ముగ్గురిపై కేసు పెట్టారు. సైఫాబాద్‌లో ఒక వ్యక్తి వాహనాన్ని వదిలిపెట్టడానికి ఫోన్‌పేలో డబ్బులు కొట్టించుకోవడం కూడా వివాదాస్పదమైంది. ఇలా వరుసగా కానిస్టేబుళ్లు, హోంగార్డులపై కేసులు నమోదవడంతో నగర కమిషనరేట్‌లో కలకలం రేపుతోంది. దారిదోపిడీ, బెదిరింపుల వంటి వ్యవహారాలకు కానిస్టేబుళ్లు, హోంగార్డులే పాల్పడుతారా.. వారి వెనక ఉండి నడిపిస్తున్నదెవరంటూ ఆ జోన్లోనే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పోలీసు స్టేషన్ల వ్యవహారాల్లోనూ ఇదే తరహా సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరి తీరు వివాదాస్పదం..!
రాజధాని పోలీసింగ్‌కు కండ్లు చెవుల్లా పనిచేసే కానిస్టేబుళ్లలో కొందరి వ్యవహారశైలి తరచూ వివాదాస్పదమవుతోంది. క్షేత్రస్థాయిలో ఉంటూ కొందరు స్థానికులతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగును ముందుకు తీసుకెళ్తుంటే.. మరికొందరు మాత్రం పోలీసుశాఖకే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఫిల్మ్‌నగర్, సనత్‌నగర్, సైఫాబాద్ ఘటనలు ఇందుకు నిదర్శనంలా చెప్పాలి. పోలీసు శాఖలోముఖ్యంగా కానిస్టేబుళ్లు, హోంగార్డులపై ప్రతీరోజూ సుమారుగా ఒక ఫిర్యాదు చొప్పున నాలుగు కమిషనరేట్ల పరిధిలో వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ పరిధిలో జరిగే వ్యవహారాల్లో , లావాదేవీల విషయంలో వారు చెప్పిందే పై అధికారులు చేయాలంటూ ఆ అధికారి పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

