సిటీబ్యూరో: వేసవికాలంలో లభించే సీజనల్ పండ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. చూడడానికి ఆకర్షణీయంగా ఉండే పండ్లను చూసీ మోసపోవద్దంటూ ఎక్స్ వేదికగా ఆయన కొన్ని సూచనలు చేశారు. వేసవి సీజన్ ప్రారంభమైందంటే చాలు, సీజనల్ ఫ్రూట్ మామిడికి ఎనలేని ఆదరణ లభిస్తున్నదని, పండ్లలో రారాజుగా ప్రసిద్ది చెందిన మామిడి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు కల్తీ విక్రయాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు.
మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పండించి విక్రయిస్తున్న వ్యాపారుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగున్నాయనే నిజాన్ని ప్రజలు మరిచిపోవద్దని హెచ్చరిస్తూ కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త అని సజ్జనార్ తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎక్కడైనా కల్తీ మామిడిపండ్లను విక్రయించినా, ఆ సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100కు లేదా హెచ్ ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు కాల్ చేయాలని సూచించారు.