సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గంజాయి వీడ్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువ చేసే గంజాయి వీడ్ ఆయిల్‌తో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ కథనం ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన రాజు, ముషీరాబాద్‌కు చెందిన ఎండీ సోయాబ్ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని సిక్‌విలేజ్ క్రాస్ రోడ్డు సమీపంలో గంజాయి వీడ్ ఆయిల్‌ను విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందం నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువచేసే 91 గ్రాముల గంజాయి ఆయిల్‌తో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కాగా ఈ గంజాయి వీడ్ ఆయిల్‌ను సాధారణ సిగరెట్లపై పూసి, తాగడంతో నేరుగా గంజాయి సేవించిన మత్తు కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కళ్యాణ్, బాను, షేక్ ఇమ్రాన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ఐ శ్రీనివాస్ , హెడ్‌కానిస్టేబుల్ మల్లికార్జున్ రెడ్డి, కరణ్ తదితరులు పాల్గొన్నారు.
డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫొర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 100 పైపర్స్ బాటిళ్లు 12, బెండర్స్ప్రైడ్ బాటిళ్లు 3, రెండు బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ కథనం ప్రకారం నగరానికి చెందిన ముత్యాల భానుచందర్, ముత్యాల అఖిలేష్ సాగర్ శుక్రవారం మధ్యాహ్నం అత్తాపూర్ ప్రాంతంలో అక్రమంగా డిఫెన్స్ మద్యం రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్ చందర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు బృందం దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 15 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.