సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): పోలీసు శాఖ తరహాలోనే ఆబ్కారీ శాఖ కూడా తమ శాఖలో చోటుచేసుకునే నేరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆబ్కారీ నేరాలకు సంబంధించిన కేసుల నమోదు, వాటి పురోగతి తదితర అంశాలన్నీ మ్యాన్యువల్‌గానే నిర్వహిస్తున్నారు. పేపర్ రహిత సేవలందించాలనే ఉద్దేశంతో ఇక నుంచి ఆబ్కారీ నేరాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు మొదలు పెట్టారు. దీనివల్ల కేసుల నమోదులో అవకతవకలు, వివక్ష వంటివి జరగకుండా చూడడమే కాకుండా దర్యాప్తు పారదర్శకంగా ఉండడం, ముఖ్యంగా అన్ని స్థాయిల అధికారులు కేసుల దర్యాప్తులోని పురోగతిని పర్యవేక్షించేందుకు ఈ ఆన్లైన్ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఆబ్కారీ కేసుల్లో కన్విక్షన్ రేటును పెంచే క్రమంలో దర్యాప్తు పకడ్బందీగా ఉండాలని ఇటీవల ఆబ్కారీ ఈడీ కమలాసన్‌రెడ్డి అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అధికారులు ఆబ్కారీ నేరాలకు సంబంధించిన పూర్తి విరవాలను డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ, అడిషనల్ ఎస్పీ భాస్కర్, బేవరీస్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య, ఈఎస్‌లు అంజిరెడ్డి, ప్రదీప్‌రావు, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతియాదవ్లు ఆన్లైన్ విధానంపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.