సిటీబ్యూరో: వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరాలని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జి నాగేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో పైరవీలకు తావు లేదని, కష్టపడి పనిచేస్తూ ప్రజాదరణ ఉన్న వారికే సముచిత స్థానం, గౌరవం లభిస్తాయని తలసాని స్పష్టం చేశారు.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోషామహల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, 10 కోట్ల రూపాయల వ్యయంతో ఫిష్ మారెట్ నిర్మాణం, నాలా నిర్మాణం, డ్రైనేజీ సమస్యల పరిషారం వంటి అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని వివరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని తలసాని సూచించారు. అక్రమంగా ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని తలసాని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిషారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.