సిటీబ్యూరో, మే24(నమస్తే తెలంగాణ): అతివేగం అంతిమప్రయాణమవుతుందని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. శనివారం బేగంపేట టీటీఐ ఆధ్వర్యంలో అమీర్‌పేటలోని క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ సిబ్బందికి రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఏసీపీ శంకర్రాజు మాట్లాడుతూ ట్రిపుల్ రైడింగ్, ఓవర్‌స్పీడ్, సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలతో వారి కుటుంబాలలో విషాదం నెలకొంటున్నదని, అటువంటి పరిస్థితి రానీయకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలన్నారు.
టీటీఐ ఇన్స్పెక్టర్ నాగుల అశోక్ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని , రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో జోనల్ రిస్క్ మేనేజర్ రవికుమార్, ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రాంబాబు, సిబ్బంది అయాన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.