సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ ) : వరద బీభత్సంతో అల్లాడిపోతున్న వరంగల్, హన్మకొండలో జీహెచ్ఎంసీ ఈవీడీఎం బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 25 మంది సభ్యులతో పాటు నిష్టాతులైన రెండు ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఒక్కో టీంకు కేటాయించిన రెండు పడవలతో పాటు ఇతర మిషనరీతో వరద సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రకాళి రిజర్వాయర్ వద్ద విరిగిపడిన చెట్లను నాలుగు చోట్ల తొలగించారని, వీటితో పాటు మట్వాడ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ ఉన్నత స్కూల్, కాలేజీ, వరంగల్ ఇండోర్ స్టేడియం సమీపంలో సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షంతో అతలాకుతలమైన వరంగల్ నగరం సాధారణ స్థితికి రావడానికి మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.