సిటీబ్యూరో, జనవరి 11(నమస్తే తెలంగాణ): మార్కెట్ బాలేదు. కొనుగోళ్లు జరగడం లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో కదలిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల వేలంపై హెచ్ఎండీఏ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎకరం రూ.వంద కోట్లకు అమ్ముడైన సందర్భం నుంచి… కనీసం రీసేల్ ప్లాట్లను విక్రయించుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల నడుమ విలువైన భూముల ద్వారా రెవెన్యూ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ కూడా భూముల వేలానికి కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొంది. బిల్డింగుల నిర్మాణం నుంచి కొత్త లే అవుట్ల వరకు బిల్డర్లు మొగ్గుచూపడం లేదు. అనుమతులు తీసుకుంటున్నా… వాటి నిర్మాణ పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఓవైపు పరిమితుల విధానంలో హెచ్ఎండీఏ కమిషనర్ సంస్కరణలు తీసుకువచ్చినా… పడుకున్న మార్కెట్ పరుగులు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి విరుద్ధమైన పరిస్థితుల్లో భూముల వేలం అనివార్యంగా మారినట్లుగా తెలుస్తోంది.
గడిచిన నాలుగేళ్లలో విక్రయించిన లే అవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లకు వేలం నిర్వహించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. కోకాపేట్ నియో పోలిస్, ఇతర లే అవుట్ల ద్వారా హెచ్ఎండీఏకు గతంలో సమకూరిన ఆదాయం నేపథ్యంలో.. ఆ స్థాయిలో రెవెన్యూ రాకపోయినా… కనీస అంచనాగా రూ.3 వేల కోట్లు వచ్చినా చాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కోకాపేట్ భూముల్లో 24 ఎకరాలను డెవలప్ చేస్తోండగా, బంజారాహిల్స్, బుద్వేల్, వంటి కీలకమైన ప్రాంతాల్లోని ప్లాట్లతో కలిపి వేలం వేయనున్నారు.
గత ప్రభుత్వం తరహాలో నగరంలో భూముల వేలం నిర్వహించి.. పరిశ్రమలో నెలకొని ఉన్న స్తబ్ధతను తొలగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో తక్కువ విస్తీర్ణంలోనే ల్యాండ్ పార్శిళ్లకు వేలం నిర్వహించడం ద్వారా మార్కెట్ ప్రస్తుత పరిస్థితితో పాటు రెవెన్యూ సమకూరుతుందని భావిస్తున్నారు. కానీ, గత ప్రభుత్వం తరహాలో వేలానికి ముందు రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలమైన నిర్ణయాలు, అందుకు అవసరమైన మౌలిక వసతులు, పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటుతో ఆయా భూములకు విపరీతమైన డిమాండ్‌ను తీసుకు రావడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.
ఎంత సేపు వివాదస్పద నిర్ణయాలకు ప్రాధాన్యతనివ్వడంతో మార్కెట్ అస్థిరత కొనసాగూతనే ఉంది. దీంతో పాటు ప్రభుత్వం కూడా హైడ్రా వంటి విధానాలను తొందర పాటు అమలు చేయడం కూడా మార్కెట్లో మరింత అలజడికి కారణమైంది. ఇక మూసీ పేరిట కూల్చివేతలు, ఇప్పటికీ కొనసాగుతున్న నిర్మాణ కూల్చివేతలతో మార్కెట్ నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో గడిచిన ఏడాది కాలంగా నగరంలో రియల్ క్రయ విక్రయాల్లో ఆశించిన పురోగతి లేకుండా పోయింది. గతంలో హైదరాబాద్ శివారులో ఏర్పడిన వెంచర్లలో ఓపెన్ ప్లాట్లలను కొనేందుకు ఆసక్తి చూపేవారు. శని, ఆదివారాల్లో నిత్యం నగరానికి వచ్చే సంఖ్య వేలల్లో ఉండేదని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు.