ఎర్రగడ్డ, డిసెంబర్ 1: ఎర్రగడ్డ డివిజన్ గులాబీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఉల్లాసవంతమైన వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ సంబురాలకు ఎర్రగడ్డ జనప్రియ పక్కనున్న మైదానం వేదికైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు హాజరుకాగా వారితో ఎమ్మెల్యే గోపీనాథ్ ఆనందాన్ని పంచుకున్నారు. షటిల్, ఖోఖో, క్యారం, చెస్ తదితర పోటీలను నిర్వహించగా చిన్నా, పెద్దా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరితో గోపీనాథ్ ముచ్చటించి ఆత్మీయ సమ్మేళనానికి అసలైన నిర్వచనాన్ని తన చిరునవ్వుతో పంచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి.. మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు ఎల్లవేళలా కట్టుబడి ఉండే కార్యకర్తలు పలు సందర్భాల్లో తమ కుటుంబ సభ్యులతో గడపలేక పోవటం తనకు తెలుసునన్నారు. ఆ లోటును భర్తీ చేయటానికి తాను చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ ఆత్మీయ సమ్మేళనమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ శ్రేణులు ఓ కుటుంబంలా కలిసి మెలిసి ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని కల్గిస్తుందన్నారు. ఇక పార్టీ కార్యకర్తలను సోదర భావంతో చూసుకుంటూ వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు డి.సంజీ వ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, పల్లవియాదవ్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని గురువారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లోని సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయాన్ని వేదికగా వినియోగించుకోవాలన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తగు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, పల్లవియాదవ్, గంట మల్లేశ్, మహ్మద్సర్దార్ తదితరులు పాల్గొన్నారు.