మూసీ నది పునరుద్ధరణ పేరిట చేపడుతున్న అభివృద్ధి పనులు వన్యప్రాణుల పాలిట శాపంగా మారింది. అటవీ శాఖ చట్టాలను తుంగలో తొక్కి.. భారీ నిర్మాణ కార్యకలాపాలతో జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలోని మృగవని జాతీయ పార్కు మనుగడపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ఫేస్-1ఏ, ఫేస్-1బీ నిర్మాణాలు పర్యావరణపరంగా ఇబ్బందులు ఉంటాయని, నిర్మాణ కార్యకలాపాలతో ఈ ప్రాంతంలో జీవావరణం దెబ్బ తింటుందని చెబుతున్నారు.
-సిటీబ్యూరో
సిటీబ్యూరో, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ) :మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదికలో జాతీయ పార్కుకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొనడంపై పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు రిజర్వ్ ఫారెస్టులు, జాతీయ పార్కులకు సమీపంలో సాగుతుందనే విషయాన్ని సర్కారు మరిచిపోయిందన్నారు. ముఖ్యంగా మృగవని జాతీయ పార్క్ మూసీ కారిడార్‌కు కిలోమీటర్ దూరంలో, రెండు జంట జలాశయాలకు సమీపంలో ఉంటుందనీ వివరించారు. అదేవిధంగా మూడు-ఐదు కిలోమీటర్ల దూరంలోనే బహదూర్‌పూర్, గగన్ పహాడ్, కొత్తగూడతోపాటు పలు రిజర్వ్ ఫారెస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం మూసీ నదికీ ఇరువైపులా ఉన్న వందల ఏళ్ల నాటి చెట్లు, సహజసిద్ధమైన పొదలను తొలగించనున్నారు. అదే విధంగా నదీ తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న భారీ వృక్ష సంపద నేలమట్టం కానున్నది. దీని కారణంగా జాతీయ పార్కు, ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ పరిసరాలు అనేక రకాల దేశీయ, విదేశీ వసల పక్షులకు నిలయంగా ఉందని, డ్రెడ్జింగ్, భారీ యంత్రాల వినియోగం, చెట్ల నరికివేత కారణంగా పక్షుల సంతానోత్పత్తి, ఆవాసాలు శాశ్వతంగా దెబ్బతింటాయన్నారు.
నదీ ప్రవాహాంలో చేపట్టే తవ్వకాలు, చెక్ డ్యాముల నిర్మాణం వలన నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గి, జలచరాలు, చేప జాతులకు ముప్పు ఉందన్నారు. నిర్మాణ దశలో ఉపయోగించే యంత్రా సామాగ్రితో విపరీతమైన వాతావరణ, శబ్ధ కాలుష్యం ఉంటుందనీ, దీంతో మృగవని పార్కులో ఉండే నెమళ్లు, కుందేలు, అరుదైన వన్యప్రాణులు కూడా మనుగడకు ఇబ్బంది వస్తుందన్నారు. జాతీయ పార్కు సమీపంలో ఉండాల్సిన పర్యావరణ వ్యవస్థను ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం మూసీ నది పరివాహాక ప్రాంతంలో జీవవైవిధ్యానికి సర్కారు ఉరి తాడు బిగిస్తుందనీ పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.