ఖైరతాబాద్, డిసెంబర్ 8 : కాలుష్య నియంత్రణ మండలి కరప్షన్ బోర్డుగా మారిపోయిందని ఎన్విరాన్మెంట్ సోషల్ వర్కర్ పీఎల్ ఎన్ రావు ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగిందని, సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకుందని, అదే స్థాయిలో హైదరాబాద్‌లోనూ వేగంగా పెరుగుతున్నదని, ప్రభుత్వం మేల్కొకుంటే ప్రమాదం తప్పదన్నారు. 1.40 కోట్ల జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతున్నదని, ఎయిర్ క్వాలిటీ 128 వరకు ఉందని, కానీ దానిని నివారించడంలో కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరు, ప్రజల ఇబ్బందులపై చర్చించాలని కోరుతూ.. అఖిల పక్ష పార్టీలను కలిసి వివరిస్తామని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరుతామన్నారు. హెటిరో యూనిట్-1లో లక్షలాది లీటర్ల కాలుష్య రసాయనాలు నిర్మానుష్య ప్రాంతాల్లో వదలడం వల్ల దోమడుగు ప్రాంతంలోని చెరువులన్నీ కలుషితమవుతున్నాయని, 600 ఎకరాలు కాలుష్య కోరల్లో చిక్కుకుందన్నారు. మూడు నెలలుగా స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ కాలుష్య మండలి పూర్తి స్థాయిలో విఫలమైనందునే ఈ పరిస్థితి నెలకొందన్నారు. రామచంద్రాపురం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఏఈ, ఈఈల నిర్లక్ష్యం వల్ల కాలుష్య నియంత్రణ పూర్తిగా దిగజారిపోయిందన్నారు.
ఓ అధికారి ఏకంగా కంపెనీలను బ్లాక్ మెయిల్ చేస్తూ తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని, చివరకు ప్రజలు కోర్టుకు వెళ్లినా ఆ రిపోర్టులతో కంపెనీలను కాపాడుతున్నారని ఆరోపించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కరప్షన్ బోర్డుగా మారిందన్నారు. తక్షణమే కాలుష్య మండలిని ప్రక్షాళన చేయాలని, రామచంద్రపురంలోని అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హిల్ట్‌ను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు పరిశ్రమలకు భూముల కేటాయింపు జరుగలేదని, కనీసం భూముల ఎంపిక కూడా చేయలేదన్నారు. ఒక్క పరిశ్రమ తరలించాలంటే కనీసం మూడు సంవత్సరాలవుతుందన్నారు. గతంలో కాలుష్యం విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే ఆయన సానుకూలంగా స్పందించి పరిశ్రమలను సైతం సందర్శించారని గుర్తు చేశారు.
సామాజికవేత్త చామల నాగసేన రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం కాలుష్యం కోరకల్లో చిక్కుకుందని, తక్షణమే ప్రభుత్వం దీనిపై కార్యాచరణ ప్రారంభించాలన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ పూర్తి స్థాయిలో కాకుండా ఓ దేవాలయానికి ఇన్చార్జి ఈవోగా, మరో వైపుఎన్నికల ఇన్చార్జిగా పనిచేయడం వల్ల నియంత్రణ కోల్పోయారన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయి అధికారిని నియమించాలన్నారు. కర్మాగారాలకు సంబంధించిన వ్యర్థ రసాయనాలు విచ్చలవిడిగా జనావాసాల మధ్య వదులుతున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి ప్రత్యామ్నాయంగా స్వతంత్ర సంస్థ ద్వారా కాలుష్య నియంత్రణ మండలిలోని కాలుష్యానికి సంబంధించిన రిపోర్టులు బయటపెట్టాలన్నారు.
పర్యావరణ సామాజికవేత్త సునంద రెడ్డి మాట్లాడుతూ కర్మాగారాలకు సంబంధించిన కాలుష్య కారకాలు పంట పొలాల్లో చేరడంతో ఆయా పంటలన్నీ కలుషితమయ్యాయని, వాటిని ఆహారంగా తీసుకొని రోగాల బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా కర్మాగారాల వల్ల భూమి, నీరు, వాయువు కాలుష్యం ఏ మేరకు జరిగిందో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అంజయ్య తదితరులు పాల్గొన్నారు.