ఘట్కేసర్ రూరల్, జూన్ 18: ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థి శేరిపల్లి విఘ్నేశ్ గౌడ్(22) అవుషాపూర్ నుంచి ఉప్పల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన విఘ్నేశ్ గౌడ్ అవుషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.