సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): కాళ్ల బలహీనత, తీవ్రమైన కాళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగికి నిమ్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ ఎండోసోపిక్ స్పైన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే… నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కరీంనగర్ జిల్లా, లింగాన్నపేట గ్రామానికి చెందిన పిట్ల నవీన్ అనే 28 ఏళ్ల యువకుడు గత కొంతకాలంగా కాళ్ల బలహీనత, తీవ్రమైన నొప్పులతో బాధపడుతూ నడవడానికి వీలు లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు.
ఎన్ని దవాఖానలు తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు నిమ్స్‌ను ఆశ్రయించాడు. రోగిని పరీక్షించిన నిమ్స్ వైద్యులు రోగికి అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రోగి వెన్నెముకలోని సున్నిత ప్రాంతంలో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఖరీదైన వైద్యం కావడంతో ఆరోగ్యశ్రీ పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) సహకారంతో బయ్ పోర్టల్ ఎండోసోపిక్ టెక్నిక్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు. కార్పొరేట్ దవాఖానలో సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను నిమ్స్‌లో పూర్తి ఉచితంగా జరిపినట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. కాగా బీహెచ్ఈఎల్ -జీఈ సంస్థ, రోటరీ క్లబ్ సంయుక్తంగా కలిసి నిమ్స్‌కు అందించిన అత్యాధునిక బయ్ పోర్టల్ ఎండోసోపిక్ స్పైనల్ సిస్టమ్‌ను ఉపయోగించి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా జరిపినట్లు డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుతం రోగి క్రమంగా కోలుకుంటున్నాడని, త్వరలోనే దవాఖాన నుండి డిశ్చార్జ్ చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన డా. ఎర్రగుంట తిరుమల్, డా. మురళీకృష్ణ, డా.ఉమా మహేశ్వర్ల బృందాన్ని, న్యూరోసర్జరీ విభాగాధిపతి డా.వంశీకృష్ణ ఎర్రమ్నేని, సీనియర్ ప్రొఫెసర్ డా.సుచందనలను డైరెక్టర్ డా.బీరప్ప అభినందించారు ఆధునిక చికిత్సలు అందిస్తున్నాం: డా.బీరప్ప, నిమ్స్ డైరెక్టర్ నిమ్స్‌కు వచ్చే రోగులకు అత్యాధునిక చికిత్సతో ఉపశమనం కల్పిస్తున్నాం. ఆధునిక ఎండోసోపిక్ సిస్టమ్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద రోగులకు అధునాతన వెన్నుముక చికిత్సలను ఉచితంగా అందిస్తున్నాం. సాధారణ డిస్ ప్రోలాప్స్ శస్త్రచికిత్సల నుంచి క్లిష్టమైన సర్వైకల్, డార్సల్ స్పైన్ ఆపరేషన్ల వరకు అనేక చికిత్సలు ఇప్పుడు నిమ్స్‌లో మినిమల్లీ ఇన్వేసివ్ ఎండోసోపిక్ విధానంలో నిర్వహిస్తున్నాం.