ఖైరతాబాద్, జూన్ 22: సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ప్రభుత్వం నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ భూములు నిజాం నవాబులదని నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ న్యాయ సలహాదారుడు గడ్డం అబేల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ ఎండీ అమీర్ అజీజ్ ఖాన్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, హెచ్ఎండీఏలు సంయుక్తంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నదన్నారు. వెంటనే నిర్మాణాలను నిలిపివేయాలంటూ ఈ ఏడాది మార్చిలో వారికి నోటీసులు జారీ చేశామన్నారు.
కానీ ఎలాంటి సమాధానం రాలేదని, ఈ భూములకు సంబంధించిన కేసు కోర్టులో ఉందన్నారు. ఇందులో సాలర్ జంగ్, ఫక్రూ ఉల్ ముల్క్ నవాబ్, అస్మాన్ జాహి పైగా, కుర్షిద్ జా పైగా వారసులకు సంబంధించిన భూములు ఉన్నాయన్నారు. పాలక ప్రభుత్వాలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. దేశం మొత్తంలో 62 కంటోన్మెంట్లు ఉండగా, అందులో 60 కంటోన్మెంట్లు బ్రిటీష్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మించారని, రెండు మాత్రం నిజాం పాలనలో ఉండేదన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ అమల్లో ఉన్న జనరల్ ల్యాండ్ రికార్డ్స్‌కు సంబంధం లేదన్నారు. ఆయా భూములన్నీ పైవేట్, నవాబులు, రాష్ట్ర ప్రభుత్వానికి తప్ప రక్షణ శాఖకు సంబంధించింది కాదని చరిత్ర చెబుతుందన్నారు. సికింద్రాబాద్ కంటన్మోనెంట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ప్రారంభించే ముందు జుడిషియల్ కమిషన్ లేదా నిజనిర్ధారణ కమిటీ వేసి సంపూర్ణంగా దర్యాప్తు చేయించాలన్నారు.
తద్వారా నిజమైన హక్కుదారులను, ఆ భూములపై సర్వ హక్కులు, టైటిట్ డీడ్స్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వ నష్టపరిహారం భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించని పక్షంలో తాము న్యాయపరంగా పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జకీర్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు సయ్యద్ మహ్మద్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గఫూర్ అస్లం, సహాయ కార్యదర్శి సయ్యద్ షాబుద్దీన్, కోశాధికారి మహ్మద్ ఫయాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.